ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత | - | Sakshi
Sakshi News home page

ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత

Jul 30 2025 7:28 AM | Updated on Jul 30 2025 7:28 AM

ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత

ఉచిత బస్సు ప్రయాణం అమలుపై వీడని సందిగ్ధత

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు బస్సు ప్రయాణం ఉచితమంటూ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది. ఆ హామీ ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారా? ఎప్పుడు ఉచిత ప్రయాణం చేద్దామా అని మహిళలు ఆర్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఉచిత బస్సు ప్రయాణం ఇదిగో అదిగో అంటూ హామీ అమలు చేయకుండా ఊరిస్తూ వస్తోంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈసారైన అమలు చేస్తారా? మరోసారి వాయిదా వేస్తారా అంటూ మహిళలు చర్చించుకుంటున్నారు.

రకరకాల ఊహాగానాలు..

చేతి వృత్తులు, చిరువ్యాపారాలు చేసుకునే వారు.. జీవనోపాధికి ప్రతి రోజు ఇతర ప్రాంతాలకు వెళ్లే మహిళా కార్మికులు ఉచిత ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకే పరిమితం చేస్తారా? రాష్ట్ర నలుమూలలు ఉచిత ప్రయాణం చేయెచ్చా అనే దానిపై స్పష్టత లేకపోవడం రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. జిల్లాకే పరిమితం అని, అది కూడా కొన్ని సర్వీసులకేనని లీకులు ఇస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం విధి విధానాలకు సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఆర్టీసీ పరిస్థితి ఇదీ..

● ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 8 డిపోలు, 12 బస్‌ స్టేషన్‌లు ఉన్నాయి. 772 బస్సులు ఉన్నాయి.

● పల్లె వెలుగు 101 బస్సులు, అల్ట్రా పల్లె వెలుగు 7, అల్ట్రా డీలక్స్‌ 10 బస్సులు ఉన్నాయి.

● సిటీ ఆర్డినరీ సర్వీసులు 180, ఎక్స్‌ప్రెస్‌ 69 బస్సులు సేవలందిస్తున్నాయి.

● జిల్లాలో 321 గ్రామాలకు గాను 67 గ్రామాలు ఇప్పటికీ బస్సు ముఖం చూడలేదు. అంటే 67 గ్రామాలకు బస్సు సర్వీసు లేదు.

● జిల్లాలో 12.20లక్షల మంది మహిళా జనాభా ఉన్నారు. సగటున రోజుకు 2.02 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటారని అంచనా.

● ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఈ ప్రయాణించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

● ప్రస్తుతం 65 ఆక్యుపెన్సీ రేటు ఉంది. ఇది మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

● అందుకు తగ్గట్టుగా బస్సులు అందుబాటులో లేకపోవడం ప్రధాన సమస్యగా పరిణమించనుంది.

● ప్రధాన రూట్లలో తప్ప గ్రామీణ ప్రాంతాలకు పల్లె వెలుగు సర్వీసులే దిక్కు.

● విజయవాడ అర్బన్‌లో సిటీ ఆర్డినరీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

బస్సులే లేకుంటే ప్రయోజనం ఎలా?

ప్రతి గ్రామానికి బస్సు సర్వీసు ఉంటేనే ప్రయోజనం అంటూ మహిళలు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తిరువూరు, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం డిపోల్లో చాలా గ్రామాలకు బస్సు సర్వీసుల్లేవు. విజయవాడ డిపో బస్సులు నేరుగా జగ్గయ్యపేట, తిరువూరు రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. ఇక లోపల కొన్ని గ్రామాలకు సర్వీసులు లేవు. తిరువూరు డిపో పరిధిలో ఆర్టీసీ, అద్దె పల్లె వెలుగు బస్సులు 32 ఉన్నాయి. ఈ డిపోలో 11 గ్రామలకు బస్సు సర్వీసులు లేవు. ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 2 ఉన్నాయి. 15 గ్రామాలకు సర్వీసులు లేవు. అలాగే జగ్గయ్యపేట డిపో పరిధిలో 24 పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ డిపో పరిధిలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఇప్పటికీ బస్సు ముఖం చూడని గ్రామాలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దు గ్రామమైన వి. అన్నవరం బస్సు సౌకర్యమే లేదు. ఈ ప్రాంతాల్లో మహిళలు ఉచిత బస్సు సౌకర్యం ఐదారు కిలో మీటర్ల మేర ఆటోల్లో ప్రయాణించి రావాల్సి ఉంటుంది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం కల్పించి ఉచిత ప్రయాణం కల్పించాలని కోరుతున్నారు.

మొత్తంమహిళలు 12.20

లక్షల మంది

బస్సు సదుపాయం

లేని గ్రామాలు

67

కండిషన్‌ అంతంత మాత్రం..

జిల్లాలో బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని బస్సులు సరైన కండిషన్‌లో లేవు. అర్బన్‌లో ఉన్న మెట్రో సర్వీసులు గతేడాదితో లైఫ్‌ ముగియడంతో వాటిని తొలగించారు. సిటీ ఆర్డినరీ సర్వీసులు కండిషన్‌ అంతంత మాత్రమే. ఈవీ బస్సులు వస్తాయని చెబుతున్నా.. అసలు ఉచిత ప్రయాణం ఉంటుందా? ఉంటే ఈవీ బస్సుల్లోనూ ఆ సౌకర్యం కల్పిస్తారా? అన్న సందేహాలు మహిళలు వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కూడా ప్రభుత్వం మహిళలకు కార్డు జారీ చేస్తుందా? ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రయాణానికి అనుమతిస్తారా? వేచి చూడాలని, అమలు జరిగితే ఇబ్బందులు తప్పవని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తోందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement