సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

Jul 30 2025 7:26 AM | Updated on Jul 30 2025 7:26 AM

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం

● దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు ● సాంకేతికత సాయంతో పటిష్ట చర్యలు ● ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల్లో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యమిస్తూ సాంకేతికత, ఏఐ టూల్స్‌ అనుసంధానంతో భక్తులకు మధురానుభూతి కలిగించేలా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ, సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు 11 రోజులపాటు జరగనున్న దసరా ఉత్సవాలపై కలెక్టర్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లో సమన్వయ శాఖల అధికారుల సమావేశం మంగళవారం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, దుర్గగుడి ఈవో వీకే శీనానాయక్‌ తదితరులు హాజరైన సమావేశంలో ఆయా శాఖలు ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై చర్చించారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, అమ్మవారి అలంకరణలు, భక్తుల క్యూలైన్లు, బారికేడింగ్‌, ఆన్‌లైన్‌, కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్లు, పార్కింగ్‌, మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఘాట్ల వద్ద షవర్ల ఏర్పాటు, భద్రతా వ్యవస్థ, ప్రసాదాల తయారీ, పంపిణీ, పబ్లిక్‌ అడ్రెసింగ్‌ సిస్టమ్‌, వైద్య శిబిరాలు, పాస్‌ల జారీ, సూచిక బోర్డుల ఏర్పాటు తదితరాలపై చర్చించి.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు.

రోజుకు లక్షమంది వస్తారని అంచనా..

కలెక్టర్‌ లక్ష్మీశ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా మూలా నక్షత్రం రోజున దాదాపు 1,50,000 నుంచి రెండు లక్షల వరకు భక్తులు రావొచ్చన్నారు. ఎంతమంది నగరానికి వచ్చినా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నిరంతర పర్యవేక్షణకు 24 గంటలూ సేవలందించే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి శాఖ నుంచి ఒక అధికారి ఈ కంట్రోల్‌ రూమ్‌లో ఉంటారన్నారు. దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌ నేపథ్యంలో అవసరం మేరకు ఇతర జిల్లాల సిబ్బంది సేవలను కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌ 20 నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి, సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ..

దసరా ఉత్సవాలను డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తామని సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు అన్నారు. ఈసారి 42 డ్రోన్లు, 5వేల సీసీ కెమెరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ‘అస్త్రం ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌’ యాప్‌ వంటివి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

భక్తుల మనోభావాలకు అనుగుణంగా..

కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్వహిస్తామని ఈఓ శీనా నాయక్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఆలయ స్థానాచార్యులు వి.శివ ప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకుడు ఎల్‌.దుర్గాప్రసాద్‌, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, డీసీపీ కేజీవీ సరిత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement