
ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో జిల్లా పరిశ్రమల మేనేజర్ వెంకట్రావు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తోందని, వీటిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమల మేనేజర్ ఆర్. వెంకట్రావు పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ సంస్థ జాతీయ చిన్నపరిశ్రమల సంస్థ, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం ఓ ప్రైవేటు హాలులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయని, ప్రతి వ్యాపారవేత్తకు యూనిట్లు నెలకొల్పడానికి సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. పరిశ్రమలకు కావాల్సిన మార్కెటింగ్ సౌకర్యాలు కూడా తమ ద్వారా తోడ్పాటును అందిస్తామన్నారు.
45శాతం పెట్టుబడి రాయితీ..
పరిశ్రమలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ మహిళలకు 45 శాతం పెట్టుబడి రాయితీ ఉందని వెంకట్రావు తెలిపారు. ఎన్‌ఎస్‌ఐసీ సీనియర్ మేనేజర్ రామారావు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు తయారుచేసిన ఉత్పతులు, కళాకృతులను, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థల మాదిరిగా స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ చేసుకునే సదుపాయం తాము కల్పిస్తామన్నారు. ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పి. భాస్కరరావు మాట్లాడుతూ మహిళా వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యులను చేసి అందరికీ ఉపయోగపడేలా పరిశ్రమలకు కావాల్సిన అన్ని రకాల పాలసీలను రూపొందించటంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ సహాయ సంచాలకులు లక్ష్మి, ఏపీ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఇమిటేషన్ జ్యూవెలరీ ప్రతినిధి జితేంద్ర, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.