ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): నూతన యాగశాలలో హోమాల నిర్వహణ మళ్లీ వాయిదా పడింది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని రాధాకృష్ణుల విగ్రహాల వద్ద దాతల సహకారంతో నూతన యాగశాల నిర్మాణం చేపట్టారు. ఈ నెల 25వ తేదీ శ్రావణ మాసం ప్రారంభం నుంచి నూతన యాగశాలలో చండీహోమం, గణపతి హోమం, నవగ్రహహోమాలను నిర్వహిస్తారంటూ ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. అయితే శ్రావణ మాసం తొలి రోజున యాగశాలలో హోమాలు ప్రారంభం కాకపోగా, దాదాపు ఐదు రోజులైనా ఇంత వరకు దేవస్థాన అధికారులు ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయడం లేదు. నూతన యాగశాలను ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం మరో మారు పరిశీలించారు. గడిచిన నెల రోజుల్లో ఇంజినీరింగ్ అధికారులు యాగశాలను 10 సార్లు పరిశీలించి ఉంటారు. చిన్న చిన్న మరమ్మతులు ఇంకా చేపట్టాల్సి ఉందని ఆలయ ఇంజినీరింగ్ అధికారులు సూచించడంతో ఆ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరో వైపున మల్లేశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని యాగశాలలోనే హోమాలను నిర్వహిస్తున్నారు. హోమాలను జరిపించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుండగా, వారికి సరైనా ప్రాంగణం లేకపోవడం ఆరు బయటే వేచి ఉండాల్సి వస్తోంది. నూతన యాగశాల నిర్మాణం పూర్తి కావడంతో భక్తులు తమ ఇబ్బందులు తీరుతాయని భావించారు. అయితే ఇంత వరకు యాగశాలకు తుది మెరుగులు దిద్దడంలో ఆలయ ఇంజినీరింగ్ అధికారులు శ్రద్ధ చూడపం లేదనే విమర్శలు వస్తున్నాయి. నూతన యాగశాలలో హోమాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వేచి చూడాలి.