
గంజాయి విక్రేతల పట్టివేత
కోనేరుసెంటర్: మచిలీపట్నంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 10 మందిని చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు పురుషులు, ఓ మహిళతో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు. బందరు డీఎస్పీ సీహెచ్ రాజా చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మచిలీపట్నంలోని మాచవరం మెట్టు సమీపంలోని రెడ్ పిచ్ ప్రాంతంలో కొంత మంది గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. చిలకలపూడి సీఐ ఎస్‌కే నభీ, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి వారిపై మెరుపు దాడి చేశారు. దాడిలో గంజాయి అమ్ముతూ మాచవరానికి చెందిన షేక్‌బాబావలి, దాసరి శ్రీసాయిశంకర్‌భవాని, రాజుపేటకు చెందిన మహ్మద్ తలహా, న్యూరైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన చప్పిడి సంతోష్, గొడుగుపేటకు చెందిన రమణి అశోక్, పీకేఎం కాలనీకి చెందిన బలగం రామలక్ష్మితో పాటు మరో నలుగురు మైనర్ బాలురు పట్టుబడ్డారు. వారి నుంచి ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఒడిశా నుంచి తీసుకువచ్చి విక్రయాలు..
నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నగరంలో మరి కొంత మంది గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించామని డీఎస్పీ తెలిపారు. త్వరలోనే వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుబడిన నేరస్తులు అరకు నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతానికి వెళ్లి గంజాయిని తీసుకువచ్చారన్నారు. మచిలీపట్నంలో దిగుమతి చేసి ఇతరులకు సరఫరా చేసేందుకు పూనుకోగా అందిన సమాచారం మేరకు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని డీఎస్పీ చెప్పారు. గంజాయి విక్రయదారులను పట్టుకున్న చిలకలపూడి పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ నభీ, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
ఆరు కేజీల గంజాయి స్వాధీనం