
వీరవల్లిలో దొంగల ముఠా అరెస్టు
హనుమాన్‌జంక్షన్‌రూరల్: రాష్ట్రంలోని పలుచోట్ల బైక్ చోరీలు, తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వీరవల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలను గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై తేలప్రోలు సర్వీస్‌రోడ్డులో మంగళవారం వీరవల్లి ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఈ నలుగురు ముఠాగా ఏర్పడి రాష్ట్రంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందని చెప్పారు. వీరిని దేవప్రకాష్(కాకినాడ), పెద్దప్రోలు అశోక్‌కుమార్(విజయవాడ), నాయిని ప్రభుకుమార్ అలియాస్ లవ్‌లీ(విజయవాడ), వేము ప్రసన్నకుమార్(తాడేపల్లి)గా గుర్తించామన్నారు. వీరిపై పలు పోలీస్‌స్టేషన్లలో బైక్ చోరీ కేసులు, తాళాలు పగలుకొట్టి దొంగతనాలకు పాల్పడిన కేసులు ఉన్నాయని చెప్పారు. తాజాగా బాపులపాడు మండలం తిప్పనగుంటలో పగటిపూట తాళం వేసి ఉన్న ఇంట్లో చోరికి పాల్పడినట్లుగా దుండగులు ఒప్పుకున్నారన్నారు. ఈ ఘటనలో అపహరించిన బంగారు అభరణాలను ఓ కార్పొరేట్ గోల్డ్ ఫైనాన్స్ సంస్ధలో తాకట్టు పెట్టినట్లుగా విచారణలో వెల్లడించారని తెలిపారు. దీంతో చోరికి గురైన 16 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి నూజివీడు కోర్టుకు తరలిస్తున్నట్లుగా వివరించారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన హనుమాన్‌జంక్షన్ సీఐ కేవీవీఎన్ సత్యనారాయణ, వీరవల్లి ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుళ్లను డీఎస్పీ అభినందించారు.