
రామవరప్పాడు: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం అర్ధరాత్రి ఎనికేపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన శ్రీనివాసరావు కొత్త ఆటోనగర్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎనికేపాడు శివాలయం పల్లాల్లో రూమ్‌లో ఉంటూ విధులకు హాజరయ్యేవాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రవీణ్‌కుమార్ శ్రీనివాసరావుకు పరిచయమై స్నేహితులయ్యారు. ప్రవీణ్‌కుమార్‌కు వివాహం కాగా ప్రస్తుతం ఇతని భార్య గర్భవతి అని సమాచారం. ఆదివారం రాత్రి శ్రీనివాసరావు, ప్రవీణ్ కుమార్ ద్విచక్రవాహనంపై రామవరప్పాడు వైపు వెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో ఎనికేపాడు జాతీయరహదారిపై మలుపు తిరుగుతున్నారు. ఇదే సమయంలో గన్నవరం నుంచి రామవరప్పాడు వైపు వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మలుపు తిరుగుతున్న వీరిని ఢీ కొట్టి కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై శ్రీనివాసరావు మృతి చెంద గా, ప్రవీణ్‌కుమార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రవీణ్‌కుమార్ తల్లి ఇటీవల మరణించగా సోమవారం పెద్ద కర్మ జరగాల్సి ఉంది. అనుకోని ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలై చికిత్స పొందుతుండటంతో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని సోదరుడు ఉమాశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
365 గ్రాముల బంగారం, రూ.30వేల నగదు చోరీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంట్లోని బంగారం, నగదు చోరీకి గురైన ఘటనపై పటమట పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటమట వాసవీనగర్ కాలనీలో ఎదుటగల ఫన్‌క్లబ్ రోడ్ 9లో చిరుమామిళ్ల గిరిజా వరప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. వారితోపాటు పనిమనిషి లక్ష్మి కూడా ఉంటోంది. గిరిజా వరప్రసాద్ వన్‌టౌన్‌లోని అమ్మ హోటల్ దగ్గర గల సుమన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో పని చేస్తున్నారు. వారు ప్రతి రోజూ రాత్రి 8.30 గంటలకు నిద్రపోతుంటారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ రాత్రికూడా యథావిధిగా అన్ని తలుపులు వేసి నిద్ర పోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు లేచి చూడగా పూజ గది తలుపు తెరిచి ఉండి, ఇంటి తూర్పు వైపు ఉన్న తలుపుకూడా తెరిచి ఉంది. అలాగే బెడ్ రూంలోని బీరువా పగులకొట్టి ఉంది. అందులోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మొత్తం వెతికి చూడగా ఉత్తరం వైపు ఉన్న సింహద్వారం పక్కనగల కిటికి ఊసలు తొలగించి అందులో నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. బెడ్ రూంలో ఉన్న బీరువాలోని సుమారు 365 గ్రాముల బంగారు వస్తువులు, రూ.30వేల నగదు కనిపించలేదు. అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి వచ్చి చోరీ చేసినట్లు బాధితుడు గిరిజా వరప్రసాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.