
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 70 ఫిర్యాదులు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు 70 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దివ్యాంగులు, వృద్ధుల వద్దకు వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 43 ఫిర్యాదులు అందగా, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై మూడు, కొట్లాటలపై ఐదు, వివిధ మోసాలకు సంబంధించి మూడు, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, దొంగతనాలకు సంబంధించి రెండు, ఇతర చిన్న చిన్న వివాదాలపై తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఉదయరాణి ఆదేశించారు.
బూడిద కాలుష్యంతో అనారోగ్య సమస్యలు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ బూడిద కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడ్డారని ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయప్రకాష్ అన్నారు. మండలలోని కిలేశపురం, జూపూడి, ఫెర్రీ ప్రాంతాల్లో ప్రజారోగ్య వేదిక బృందం సోమవారం పర్యటించింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కాలుష్యం వల్ల ప్రజలు చర్మ, శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నట్లు చెప్పారు. ఎన్టీటీపీఎస్ ఫ్లై యాష్‌తో పాటు బూడిద చెరువు వల్ల వాయు కాలుష్యం ఏర్పడి పరిసర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. తాగునీరు కూడా కలుషితం అవుతోందన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణయ్య, ప్రధాన కార్యదర్శి డి.కామేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.సీతారామారావు, మాజీ సర్పంచ్ కొల్లి వెంకటేశ్వరరావు, శ్రీధర్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.