
ఎల్‌బీఆర్‌సీఈలో 32 స్టార్స్ ఫుట్‌బాల్ అకాడమీ
మైలవరం: మైలవరం లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల తోడ్పాటుతో స్థానిక కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన 32 స్టార్స్ ఫుట్‌బాల్ అకాడమీని రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం గౌరవాధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఫుట్‌బాల్ అకాడమీలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 32 మంది ఫుట్‌బాల్ క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. క్రీడాకారులందరికీ స్థానికంగా కల్పించినటువంటి స్కూల్, కాలేజీ, వసతి సదుపాయాలు, క్రీడాకారుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన మైదానం, జిమ్ సదుపాయాలను కోటగిరి శ్రీధర్ పరిశీలించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ఫుట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ఉపయోగించుకుని క్రీడాకారులు అందరూ దేశం గర్వించదగ్గ ఫుట్‌బాల్ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడుశే శేషగిరిరావు, కార్యదర్శి చక్రవర్తి, కోశాధికారి బుజ్జి, ఏలూరు జిల్లా ఫుట్‌బాల్ సంఘం కార్యదర్శి పవన్‌కుమార్, కోనసీమ జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు నీలాద్రి, విశాఖపట్నం జిల్లా ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు రాజారావు, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షుడు అనిల్ పాల్గొన్నారు.