
నీలినీడలు!
పరీక్షలన్నీ జిల్లా కేంద్రానికే..
నియోజకవర్గ కేంద్రాల్లో ల్యాబ్‌లకు వచ్చే పరీక్షలన్నీ జిల్లా కేంద్రానికి తీసుకురావాలని ల్యాబ్ బాధ్యతలను చూసే ఇన్‌చార్జి ఏవోలకు, పశుసంవర్థక శాఖ ఎల్‌టీలకు ఆదేశాలు వచ్చాయి. పెడన పశుసంవర్థక శాఖ టెక్నీషియన్ మెడికల్ లీవ్ పెట్టడంతో ఈ ల్యాబ్ వారంలో రోజు విడిచి రోజు మూడు రోజులు తెరుస్తున్నారు. పరీక్షలు చేయడానికి వర్క్ అంతంత మాత్రమే ఉండటంతో ఏమి చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ల్యాబ్ పరిసరాలు కూడా చెత్తాచెదారంతో నిండిపోయి పాములకు ఆవాసాలుగా ఏర్పడుతున్నాయి.
ఏఓలే ఇన్‌చార్జులు
వీటిపై అగ్రికల్చర్ డీఏవో మనోహారరావు మాట్లాడుతూ అగ్రిల్యాబ్‌లకు నియోజకవర్గ కేంద్రాల్లోని ఏవోలనే ఇన్‌చార్జులుగా నియమించామన్నారు. సిబ్బంది కొరత కారణంగా అక్కడకు వచ్చే పరీక్షలను జిల్లా కేంద్రానికి పంపించాలని పేర్కొన్నామని తెలిపారు.
పెడన: ఎన్డీయే కూటమి పాలనలో వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాటిని ఉంచుతారో లేదో అనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ రైతులతో పాటు పాడి రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో నాడు వైఎస్సార్ సీపీ హయాంలో నియోజకవర్గ కేంద్రంలోని ప్రతి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఒక అగ్రి ల్యాబ్ ఉండాలని నిర్ణయించారు. దీంతో పాటు పశుసంవర్థక శాఖ ప్రయోగశాల కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక్కొక్క దానిని రూ.60 లక్షలకు పైగా వెచ్చించి నిర్మించారు. వీటిలో పరీక్షల కోసం రూ.లక్షల ఖర్చుపెట్టి ప్రత్యేకమైన పరికరాలు, పనిముట్లను ఏర్పాటు చేశారు. అగ్రి ల్యాబ్‌లో ఏవోతో పాటు ఏఈవోను ప్రత్యేకంగా నియమించారు. వ్యవసాయశాఖ రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లకుండా నియోజకవర్గ కేంద్రంలో మట్టి పరీక్షలు, ఎరువులు, విత్తనాల పరీక్షలు తదితర వాటిని చేయించుకునేవారు. పాడి రైతులు తమ పశువులకు రక్త పరీక్షలతో పాటు పేడ, మూత్రం తదితర వాటిని కూడా పరీక్షలు చేయించుకున్నారు. కానీ నేడు వ్యవసాయశాఖ రైతులకు, పాడి రైతులకు ఈ ల్యాబ్‌లు అందుబాటులో లేకుండా ఎన్డీయే సర్కారు కంకణం కట్టుకుంది. ల్యాబ్‌లు తెరుచుకునే పరిస్థితి రాకుండా చేస్తోంది.
● ఎన్డీయే అధికారంలోకి రాగానే.. సంచార వైద్యశాల అంబులెన్సులు రద్దు
ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీలో పేదలకు, వ్యవసాయ రైతులకు, పాడి రైతులకు కల్పించిన వాటిని తొలగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా సంచారవైద్యశాల అంబులెన్సులను రద్దు చేసింది. గతంలో వైఎస్సార్ పశుసంవర్థక శాఖ ల్యాబ్ పరిధిలో నియోజకవర్గానికి రెండు చొప్పున ఉండేవి. 1962 నంబరుకు ఫోను చేసి పశువులకు ఇబ్బంది అంటే పశువైద్యులు, సిబ్బంది అంబు లెన్సుతో అనారోగ్యానికి గురైన పశువు ఉన్న చోటికే వెళ్లి వైద్యం అందించేవారు. ఇటువంటి అంబులెన్సులను సైతం రద్దు చేశారు. ఇప్పుడు ల్యాబ్‌ల వంతు వచ్చింది. సిబ్బందిని నియమించకుండా.. తెరవనీయకుండా చేస్తున్నారు.
● ఉన్న వారిని తొలగించి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అగ్రిల్యాబ్‌లో ఒక ఏవో, ఏఈవో విధులు నిర్వహించే వారు. స్థానికంగా రైతుల నుంచి వచ్చే వాటినే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే శాంపిల్స్‌ను పరీక్షించి నివేదికలను పంపించేవారు. అటువంటి సిబ్బందిని ప్రస్తుత ఎన్డీయే కూటమి ఇతర మండలాలకు బదిలీ చేసింది. నియోజకవర్గ కేంద్రంలో ఏవోగా విధులు నిర్వహించే వారికే ల్యాబ్ బాధ్యతలను చూసుకోవాలని అప్పగించారు. వీరికి మండలంలోని ఏవో బాధ్యతలతోనే రోజులు గడిచిపోతున్నాయి.
వైఎస్సార్ అగ్రి ల్యాబ్‌లపై నిర్లక్ష్యం అప్పుడప్పుడు తెరుచుకుంటున్న పశువ్యాధి నిర్ధారణప్రయోగశాలలు అధికారులను నియమించ కుండా ఏవోలకు బాధ్యతలు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 10 ప్రయోగశాలలు జిల్లాకు ఒక ల్యాబ్ చాలంటున్న కూటమి సర్కారు
అగ్రిల్యాబ్‌లకు తెరుచుకోని తాళం
ఇలాంటి పరిస్థితుల్లో అగ్రి ల్యాబ్ తాళం తెరుచుకోని దుస్థితి ఎదురవుతోంది ఇక పశుసంవర్థక శాఖ ల్యాబ్‌ల్లో మొదటి నుంచి ల్యాబ్ టెక్నీషియన్‌ను, ఒక అసిస్టెంట్‌ను నియమించారు. ఈ ల్యాబ్‌లో కూడా అసిస్టెంట్‌లను తొలగించి ఎల్‌టీని మాత్రమే ఉంచారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతో పాటు పెడన, పామర్రు, కంకిపాడు, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, గన్నవరం నియోజక వర్గాల్లో ఈ ల్యాబ్‌లున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ నియోజకవర్గాలలో ల్యాబ్‌లున్నాయి. మచిలీపట్నం, విజయవాడలలో ల్యాబ్‌లకు మినహా మిగిలిన చోట ఏవో, ఏఈవోలను తీసేశారు.

నీలినీడలు!