
అందని ఉపాధి
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో సాధారణ పరిస్థితుల కంటే భిన్నమైన వాతావరణం నెలకొంది. తీవ్రమైన ఎండలు వేశాయి. ఎండను సైతం ఖాతరు చేయకుండా కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. సొమ్ము అందుతుందని ఆశించిన కూలీలు ప్రతి రోజూ అధికారులు, బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ నిరాశ చెందుతున్న దుస్థితి. నెలల తరబడి కూలీ డబ్బులు అందకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇల్లు గడవటానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. పాలకులు కూలీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బకాయి పేరుకుపోయింది. కూలీల సమస్యను పట్టించుకోకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సొమ్ము విడుదలలో తాత్సారం
కంకిపాడు: ఉపాధి పనుల వేతనాల కోసం కూలీలు నిరీక్షిస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలీల బ్యాంకు ఖాతాలకు జమ కావడం లేదు. అధికారులు, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా డబ్బులు మాత్రం చేతికందడం లేదంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలి సొమ్ము విడుదల కావడంలో పాలకులు తాత్సారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
25 మండలాల్లో..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కృష్ణా జిల్లాలోని 25 మండలాల్లో ఉపాధి పనులు నిర్వహించారు. ప్రధానంగా కాలువలు, చెరువుల పూడికతీత పనులు, తూటు, గుర్రపుడెక్క తొలగింపు, మెట్ట భూముల్లో ఆయిల్‌పామ్, మామిడి, ఇతర ఉద్యాన మొక్కలు నాటే పనులు చేశారు.
2025–26 సంవత్సరానికి 74 లక్షలు పనిదినాలు లక్ష్యంగా డ్వామా అధికారులు నిర్దేశించుకున్నారు. ఇందుకు జిల్లాలోని 2.50 లక్షల జాబ్ కార్డుల్లో ఉన్న 3.18 లక్షలు పైగా వ్యక్తిగత జాబ్ కార్డుదారులు ఉపాధి కూలీలుగా ఉన్నారు. వీరికి ఈ ఏడాది వేసవిలో అత్యధికంగా ఉపాధి కల్పన చేశారు. ఇప్పటికే 53 లక్షలు పనిదినాలు పూర్తి చేశారు. దీని తాలూకూ రూ.150 కోట్లు సొమ్ము కూలి రూపంలో రైతులకు అందాల్సి ఉండగా కొంత మేరకు చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ వరకూ ఉపాధి పనుల్లో పాల్గొన్న కూలీలు సొమ్ము చెల్లించినట్లు డ్వామా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పేరుకున్న బకాయిలు
జిల్లాలో ఏప్రిల్ నెల వరకూ ఉపాధి పనులు చేసిన కూలీ సొమ్ము చెల్లింపులు జరిగాయి. ఇంకా 25 లక్షలు పనిదినాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించి రూ. 70 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో కూలీ రెండు, మూడు నెలల పాటు ఉపాధి పనుల్లో పాల్గొన్నారు. సరా సరిన రోజుకు రూ.260పైగా కూలిసొమ్ము ఉపాధి కూలీలకు దక్కాల్సి ఉంది.
మూడు నెలలుగా విడుదల కాని వేతనాలు కృష్ణా జిల్లాలో 25 లక్షల పనిదినాలకు సంబంధించి రూ.75 కోట్ల బకాయిలు సొమ్ము కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ వేతనాలు విడుదల చేయాలంటున్న కూలీలు