
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
కంచికచర్ల: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. ముమ్మరంగా ఖరీఫ్ వ్యవసాయ పనులు సాగుతున్న వేళ సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు అంటుబాటులో ఉన్నాయని చెప్పారు. కంచికచర్లలో శ్రీ కనకదుర్గ ఎరువులు, పురుగుమందుల దుకాణం, గోదాముతో పాటు మన గ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను సోమవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా స్టాక్ రిజిస్టర్‌తో పాటు ఫిజికల్ స్టాటస్ ఆన్‌లైన్‌లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉన్నామని, ప్రస్తుతం జిల్లాలో 9,976 మెట్రిక్ టన్నుల యూరియా, 2,457 మెట్రిక్ టన్నుల డీఏపీ, 1,157 మెట్రిక్ టన్నుల ఎంవీపీ, 14,197 మెట్రిక్ టన్నుల ఎస్‌పీకే మొత్తం 30,332 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు తనిఖీలు చేస్తున్నారని, డీలర్లు కృత్రిమ కొరతను సృష్టించడం, ఎరువులను అధిక ధరలకు విక్రయించడం, రైతు కోరిన ఎరువును కాకుండా వేరే ఎరువులను ఇవ్వడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు లేదా ఏదైనా సమాచారం కోసం కలెక్టరేట్‌లో 91549 70454 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగంతో కలిగే దుష్పరిమాణాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రకృతి సాగువిధానాల దిశగా మళ్లిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. జిల్లాలో అగ్రిటెక్‌ను అధిక ఆదాయాలు వచ్చే ఉద్యాన పంటలను కూడా ప్రోత్సహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. తనిఖీల్లో నందిగామ ఆర్డీఓ బాలకృష్ణ, అగ్రికల్చర్ ఏడీ ఐకే శ్రీనివాసరావు, తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మండల వ్యవసాయ అధికారి కె.విజయకుమార్, ఆర్‌ఐ వెంకటరెడ్డి, వీఆర్వోలు పాల్గొన్నారు.
రైతుల నుంచి ఫిర్యాదులొస్తే ఉపేక్షించేది లేదు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ