
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు ఎడ్యుకేషన్: పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంటు అండ్ ఇంజినీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీఎంబీ బుచ్చిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జెడ్పీ సమావేశ మందిరంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. బుచ్చిరాజు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలోని విశ్రాంత ఉద్యోగులు, ఇంజినీరింగ్ అధికారుల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది పంచాయతీరాజ్ విశ్రాంత ఉద్యోగులు, ఇంజనీర్లు పెన్షన్, మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో వేతన విభజన చట్టాల ముసుగులో జరుగుతున్న వర్గీకరణ కారణంగా ఇబ్బందులు పడుతూ, నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ దారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి గానూ అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపుతో ప్రధానికి ఒక వినతి పత్రాన్ని పంపనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పంచాయతీరాజ్ ఉద్యోగుల ఇంజినీర్ల వేతన సవరణ, బకాయిలు, డీఏలు, మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని వివరించారు.
వేతన సవరణను పూర్తి స్థాయిలో అమలుచేయాలి
12వ వేతన సవరణ పూర్తి స్థాయిలోఅమలు చేయడంతో పాటు 35 శాతం ఐఆర్ మంజూరు చేయాలని ఆయన కోరారు. 12వ పీఆర్సీలో చట్టబద్ధత కల్పించి, 11 పీఆర్సీలో అమలు చేసిన విధంగా అదనపు పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో 315ను సవరించి, భార్యాభర్తలకు కుటుంబ పెన్షన్ వర్తించేలా మార్పులు చేయాలని సూచించారు. యూజీసీ స్కేల్స్ పరిధిలోకి వచ్చే పెన్షన్‌దారులకు అదనపు పింఛన్, 10వ పీఆర్సీ తరహాలో రిఫండ్ డెత్ రిలీఫ్ అమలు పర్చాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలతో పాటు ఉద్యోగుల హెల్త్ స్కీం క్లెయిమ్స్‌ను చెల్లించాలని డిమాండ్ చేశారు. మెడికల్ రీ–యింబర్స్‌మెంట్ పూర్తిగా ఈహెచ్‌ఎస్ కింద చెల్లించాలని, ఆరోగ్య బీమా కార్డులను పరిమితులు లేకుండా అందరికీ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్‌దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ వెంటనే ఏర్పాటు చేయడంతో పాటు అమరావతిలో భవనం నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులను కలుస్తామని తెలిపారు. సమావేశంలో సంఘ అసోసియేట్ ప్రెసిడెంట్ షేక్ రియాజ్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి యు.కూర్మారావు, కోశాధికారి బి.శివరామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.శ్రీనివాసరావు, ఎం.వి.రంగాచారి, వి.వెంకటేశ్వరరావు, 13 జిల్లాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
పీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బుచ్చిరాజు