
ఘనంగా కుంభాభిషేక మహోత్సవాలు
విజయవాడ కల్చరల్: టీటీడీ ఆధ్వర్యంలో 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన, మహాసంప్రోక్షణ, కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో కొలువైఉన్న పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో అధికారులు సర్వాంగ సుందరంగా యాగశాలను నిర్మించారు. టీటీడీ కంకణభట్టార్ మురళీకృష్ణ అయ్యంగార్, వేదాంతం వెంకటకిషోర్ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేశారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి, ఎస్వీఎస్‌ఎస్ టెంపుల్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, డెప్యూటీ ఏఈ నాగభూషణం పాల్గొన్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నవగ్రహారాధన, కుంభారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
డీఎస్పీల మృతికి రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం సంతాపం
వన్‌టౌన్(విజయవాటపశ్చిమ): ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డీఎస్పీల మరణానికి సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు రిటైర్డ్ పోలీసు అధికారుల సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏఎస్‌ఎన్‌రెడ్డి, టి.హరి కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చౌటుప్పల్ సమీపంలోని జాతీయ రహ దారి–65పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌కు చెందిన ఇద్దరు డెప్యూటీ సూపరింటెండెంట్లు అకాల మరణం తమ సంఘానికి తీవ్ర మనస్తాపం కలిగించిందని పేర్కొన్నారు. మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడటంపై దిగ్భ్రాంతి చెందామని తెలిపారు. గాయపడిన అధికారులు త్వరగా, పూర్తిగా కోలుకోవాలనికోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈగల్ బృందాల విస్తృత తనిఖీలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈగల్ బృందాలు శనివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏసీపీలు ఎస్.కిరణ్‌కుమార్, కె.లతాకుమారి పర్యవేక్షణలోఇంటర్ సెప్టర్, యాంటీ నార్కోటిక్, ఈగల్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ మద్యం, గంజాయి, ఇతర వస్తువులను రవాణా నియంత్రించడం, అనుమానిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేయడం వంటివి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిని గుర్తించి వారికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా శనివారం రాత్రి 163 మందికి కౌన్సిలింగ్ ఇవ్వగా, 69 మందిని అనుమానిత వ్యక్తులుగా మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజ్ ద్వారా తనిఖీ చేశారు.

ఘనంగా కుంభాభిషేక మహోత్సవాలు