
ఎక్మోతో పునర్జన్మ ప్రసాదించవచ్చు
మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సునీల్ కారంత్
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండె, ఊపిరితిత్తుల పనితీరు క్షీణించినప్పుడు ప్రత్యామ్నాయంగా ఎక్మోపై ఉంచి, రోగికి చికిత్స అందించొచ్చని మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సునీల్ కారంత్ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖతో కలిసి మణిపాల్ హాస్పిటల్ ఆదివారం ‘మాస్టరింగ్ ఎక్మో’ అనే అంశంపై కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్(సీఎంఈ) సదస్సు ఆదివారం జరిగింది. విజయవాడ మహాత్మాగాంధీరోడ్డులోని ఓ హోటల్‌లో జరిగిన సదస్సును డాక్టర్ సునీల్ కారత్, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ సురేష్‌కుమార్, డాక్టర్ హనుమయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దేశంలో కేర్ మెడిసిన్‌లో అత్యుత్తమ నిపుణులు ఎక్స్‌ట్రా కార్పోరియల్ మైంబ్రేన్ ఆక్సిజనేషన్(ఎక్మో)లో అధునాతన పద్ధతులు, ఆవిష్కరణలపై చర్చించారు. ఎక్మో భాగాలు, కాన్యులేషన్ పద్ధతులు, ఆక్సిజనేటర్ వైఫల్యం, ఎయిర్‌ఎంబోలిజం నిర్వహణ–4హెచ్ ట్రబుల్షూటింగ్ వ్యూహాలపై దృష్టి సాధించే ఆచరణాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేసి డెమో ఇచ్చారు. డెమోను డాక్టర్లు శిల్పా చౌదరి, ధరణింద్ర, శ్రీకాంత్, జ్యోతి, దినేష్ నిర్వహించారు. కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన కార్డియో వాస్కులర్ సర్జన్ డాక్టర్ దేవానంద్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీనివాస్ సామవేదం, బెంగళూరుకు చెందిన డాక్టర్ కార్తీక్ హనుమాన్ శెట్టి, డాక్టర్ వినయ్.కె, మణిపాల్ హాస్పిటల్ క్రిటికల్‌కేర్, పల్మనాలజీ వైద్యులు టి.శ్రీనివాసరావు, డాక్టర్లు వి.దినేష్‌కుమార్, లోకేష్ గుత్తా, ఉదయ్‌కిరణ్, డాక్టర్ జగన్‌మోహన్, మాధుర్య సీహెచ్, డి.అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి పర్యవేక్షించారు.