
కృష్ణానదికి ‘మహావస్త్ర సమర్పణ’కు సన్నాహాలు
నాగాయలంక: కృష్ణానది వద్ద శ్రీరామపాదక్షేత్రం కమిటీ, భక్తుల ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీ చేయనున్న మహావస్త్ర సమర్పణ వేడుక నిర్వహణ సన్నాహాకాలు నాగాయలంక ఘాట్ వద్ద ఆదివారం ఆరంభించారు. దాతలు సమకూర్చే కొత్త చీరలను సమీకరించి క్షేత్రపాలకుడు తలశిల రఘుశేఖర్ నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవకులు, భక్తులు ఒకదానికి ఒకటి ముడి వేస్తూ చీరల తోరణంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే 350చీరలు కమిటీకి అందగా వీటిల్లో 300చీరలను ఆర్యవైశ్య ప్రముఖులైన చిట్టా హరేకృష్ణ, వాణి దంపతుల ఆధ్వర్యంలో దాతల నుంచి సేకరించి తెచ్చారు. నదికి ఇరువైపుల రెండు తీరాల నడుమ రెండు కిలో మీటర్లకు పైగా దూరం ఉన్నందున వీటిని మహా వస్త్రంగా మలచడంలో ఇబ్బందులు అధిగమించే ప్రణాళికలో భాగంగానే ఈ సన్నాహాక పనులు ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు రఘుశేఖర్ చెప్పారు. వారణాసిలో గంగానదికి ఇలా 400మీటర్ల మహావస్త్రం సమర్పించినట్లు వచ్చిన వీడియో వార్త ఈవేడుక నిర్వహణకు స్ఫూర్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.