
చంద్రబాబు అంటేనే దగా, మోసం
భవానీపురం(విజయవాడపశ్చిమ): అంబేడ్కర్‌ను చూస్తే రాజ్యాంగం, అబ్దుల్ కలాంను చూస్తే రాకెట్లు, ఉపగ్రహాలు స్మరణకు వచ్చినట్లు చంద్రబాబును చూస్తే దగా, నయవంచన, మోసం గుర్తుకు వస్తాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అబ్జర్వర్ మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. 45వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సరగడ శంకరరెడ్డి ఆధ్వర్యంలో విద్యాధరపురం కబేళా సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని ఆయన పశ్చిమ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తాను గెలిచి.. రాష్ట్ర ప్రజలను ఓడించిన ఏకై క నాయకుడు చంద్రబాబు అన్నారు. మానసికంగా గెలిచింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీయేనని చెప్పారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకుండా సిగ్గు లేకుండా సుపరిపాలన అంటూ వచ్చి ప్రజల నిలదీతకు గురయ్యారని పేర్కొన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దౌర్బాగ్య స్థితికి తీసుకువచ్చిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.
ఆ బాండ్లు ఏమయ్యాయి?
వైఎస్సార్ సీపీ పశ్చిమ ఇన్‌చార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్ర బాబు, పవన్ కల్యాణ్ త్రికరణశుద్ధితో సంతకాలు చేసిన బాండ్లను ప్రజలకు ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా బాండ్లలో పేర్కొన్న ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవడం ఇది నాలుగోసారి అన్నారు. వైఎస్ జగన్ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తే నారా లోకేష్ మెదడులో నుంచి వచ్చిన ఆలోచన అని నిస్సిగ్గుగా చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.
నాడు సుభిక్షం..
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను వెన్నుపోటు పొడిచి అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. ఈ సందర్భంగా బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. ఇంటింటికీ వెళ్లి వారి మొబైల్ ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను డౌన్‌లోడ్ చేయించి స్కాన్ చేపించాలని, తద్వారా కూటమి ప్రభుత్వ మోసాలను వివరించాలని కోరారు. పలువురు కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు వేణుగోపాలరెడ్డి ఘనంగా 45వ డివిజన్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం