
31న కృష్ణానదికి మహా వస్త్ర సమర్పణ
నాగాయలంక: పవిత్ర కృష్ణానదికి ఈనెల 31వ తేదీన మహా వస్త్ర సమర్పణ వేడుక నిర్వహిస్తున్నట్లు నాగాయలంక శ్రీరామపాద క్షేత్రం కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, క్షేత్ర పాలకుడు తలశిల రఘుశేఖర్ శనివారం తెలిపారు. సాగర సంగమ వేణి సర్వ పాపహరణిగా సాగర జలాలతో కలసి ఈ ప్రాంత ప్రజలను నిరంతరం తరింప చేస్తున్న నదీమతల్లికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు 401 చీరలతో 2005 మీటర్ల పొడవైన తోరణం రూపొందించి కృష్ణవేణికి మహా వస్త్ర సమర్పణ చేస్తామన్నారు. ఈ చీరల తోరణాన్ని శ్రీరామపాదక్షేత్రం ఘాట్‌లో కృష్ణవేణి విగ్రహం నుంచి అవతలి వైపు గుంటూరు జిల్లా తీరం ఏర్పాటు చేస్తామన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు శనివారం రూ.1.56 లక్షల విరాళం సమర్పించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన ఏడూరి శ్రీనివాసరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1.56 లక్షల విరాళం అందజేసింది. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మ వారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ప్రతి ఇంటిని
సర్వే చేయడమే లక్ష్యం
వీరులపాడు: రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ సర్వే చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సమిత్వ సర్వే చేపట్టిందని రాష్ట్ర పీ–4 డైరెక్టర్ నిశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని పొన్నవరంలో జరుగుతున్న సమిత్వ సర్వేను ఆయా జిల్లాల పంచాయతీ అధికారులు శనివారం పరిశీలించారు. నిశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సమిత్వ సర్వే చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు పరిశీలనకు వచ్చారని తెలిపారు. సమిత్వ సెంట్రల్ టీం సహాయంతో మండలంలోని పంచా యతీ రాజ్ సిబ్బంది ఆరు బృందాలుగా ఏర్పడి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. డీపీఓలు లావణ్య, కొడాలి అనురాధ, డీఎల్పీఓ రఘువరణ్, డెప్యూటీ ఎంపీడీఓ రాజశేఖర్ పాల్గొన్నారు.
తృప్తి క్యాంటీన్ ప్రారంభం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని పురపాలక, పట్టణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అన్నారు. పంజాసెంటర్ సమీపంలో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్‌ను మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.తేజ్‌భరత్, మునిసి పల్ కమిషనర్ ధ్యాన్‌చంద్రతో కలిసి సురేష్‌కుమార్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ప్రారంభించిందన్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు జీఎస్టీతో కలిపి ప్రాజెక్ట్ వ్యయం రూ.14,51,400 అవుతుందని తెలిపారు. ఈ మొత్తంలో 75 శాతం డ్వాక్రా మహిళలు, 25 శాతం సారాస్ ఏజెన్సీ లోన్ ద్వారా సమకూరుతుందన్నారు. క్యాంటీన్ నిర్వహణ కోసం కంటెయినర్‌ను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ క్యాంటీన్లను ముఖ్యమైన కూడళ్లలో, హైవేలకు సమీపంలో ఏర్పాటు చేస్తారన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తేజ్‌భరత్ మాట్లాడుతూ.. 30 వేల మంది డ్వాక్రా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.

31న కృష్ణానదికి మహా వస్త్ర సమర్పణ