
శిశు వికాస ప్రగతిపై దృష్టిపెట్టండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): శిశు వికాస కీలక ప్రగతి సూచికల (కేపీఐ)పై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు దృష్టిసారించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్యపై శనివారం సమన్వయ సమావేశం జరిగింది. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, వాటి సాధనలో పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాలు, కుటుంబ ఆధారిత సంరక్షణకు ప్రోత్సాహం, సంస్థా గత మద్దతు, ఆర్థిక సహకారం, శిశు సంరక్షణ పథకాల అనుసంధానంతో మిషన్ వాత్సల్య అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎత్తుకు తగిన బరువు, పూర్వ ప్రాథమిక విద్య, శారీరక–మానసిక ఆరోగ్యం వంటివాటిపై దృష్టిపెట్టాలని ఇందుకు అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కీలకమని అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల సంక్షేమం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిషన్ వాత్సల్యను అమలుచేస్తున్నాయని వివరించారు. 2023–24 నుంచి 2024–25 వరకు తల్లి లేదా తండ్రి లేని, తల్లిదండ్రులు లేని 18 ఏళ్లలోపు 551 మంది బాలబాలికలకు ఈ పథకం ద్వారా నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.73 కోట్లు ఆర్థిక సహాయం అందించామని వివరించారు. పాఠశాలలు, కళాశాలల్లో బాల్య వివాహాలు, పోక్సో, బాలల హక్కుల చట్టాలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. జిల్లాలో ఉన్న 16 బాలల సంరక్షణ కేంద్రాల ద్వారా నాణ్యమైన పారదర్శకమైన సేవలందించాలని, రెస్క్యూ చేసిన బాలబాలికలను జువైనెల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్–2015 ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జువైనెల్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ సువార్త, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రాజేశ్వరరావు, డీపీఓలు సత్యవతి, జ్యోతి, సీడబ్ల్యూసీ సభ్యులు రవి భార్గవ్, సీడీపీఓలు, డీసీపీయూ సిబ్బంది, పర్యవేక్షకులు, బాలల కేంద్రాల ఇన్‌చార్జ్‌లు తదితరులు పాల్గొన్నారు.