
తక్కువ ఖర్చుతో మ్యాజిక్ డ్రెయిన్‌లు
నందిగామ రూరల్: మ్యాజిక్ డ్రెయిన్‌లతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, వాటిని తక్కువ ఖర్చుతో నిర్మించుకోవచ్చని డీపీఓ లావణ్య కుమారి సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మండలంలోని సోమవరం గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను 25 జిల్లాల డీపీఓలు, సీఈఓలతో కలిసి ఆమె శనివారం పరిశీలించారు. ముందుగా ఏపీడీఓలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు మ్యాజిక్ డ్రెయిన్ వివరాలను డీపీఓలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.90 వేల ఖర్చుతో 100 మీటర్ల మేర డ్రెయిన్ నిర్మిస్తున్నామని లావణ్యకుమారి తెలిపారు. ఈ డ్రెయిన్‌లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోతుందని వివరంచారు. తద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని సూచించారు. మురుగు నీరు నిల్వ ఉండకపోవటంతో దుర్వాసన, దోమల వ్యాప్తి కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.
500 మీటర్లకు ఐదు మ్యాజిక్ డ్రెయిన్‌లు
సోమవరం గ్రామంలో రెండు వేల మీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉందని ఏపీడీఓలు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తెలిపారు. ముందుగా కలెక్టర్ వెయ్యి మీటర్లకు ప్రతిపాదించగా ప్రస్తుతం 500 మీటర్ల మేర ఐదు మ్యాజిక్ డ్రెయిన్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మిగిలిన వెయ్యి మీటర్ల పనులను ప్రతిపాదనల అనంతరం చేపడ్తామన్నారు. గ్రామంలో జరుగుతున్న మ్యాజిక్ డ్రెయిన్‌ల పని తీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామేశ్వరరావు, ఏపీఓ శరత్, పలు శాఖల అధికారులు, గ్రామ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.