
రేపు ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష
లబ్బీపేట(విజయవాడతూర్పు): బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ, మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసిన అనంతరం అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 28న విజయవాడ ధర్నా చౌక్‌లో మహిళలు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. ఈ దీక్షల్లో పెద్ద సంఖ్యలో ఓబీసీ మహిళలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ టిక్కిల్ రోడ్డులోని బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ స్థాయిలో జన గణనలో కులగణన జరిగి, ఆపై నియోజకవర్గాల పునర్విభజన చేసిన అనంతరమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. సమావేశంలో కుమ్మర క్రాంతికుమార్, ఉద్యోగ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మానేపల్లి వీవీఎస్ మూర్తి, కార్యనిర్వాహక అధ్యక్షులు గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, చెప్పాడ చందు, వాక వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మహిళల రక్షణకు శక్తి, ఈగల్ బృందాలు ఏర్పాటు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళల రక్షణ కల్పించేందుకు శక్తి, ఈగల్ బృందాలు పనిచేయనున్నాయి. ఆయా బృందాలతో డీసీపీ కేజీవీ సరిత శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాలతో నిర్వహించిన ఈ సమావేశంలో డీసీపీ సరితతో పాటు, మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ టి.దైవప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో, నిర్జీన ప్రదేశాలలో, ప్రతి కళాశాల, స్కూల్‌లలో మహిళలు, పిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా చేసుకోవాలి, గుడ్, బ్యాడ్ టచ్, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు, శక్తి యాప్ ఉపయోగాలపై ఏ విధంగా అవగాహన కలిగించాలనే అంశాలపై కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా డీసీపీ సరిత మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా మేమున్నామనే భరోసా ప్రత్యేక బృందాలు పనిచేస్తామన్నారు. సోషల్‌మీడియా, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోక్సో యాక్ట్ గురించి, డయల్ 112, శక్తి యాప్ ఉపయోగాలను తెలియచేయాలని ఆమె సూచించారు.
జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల వర్షపాతం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో 18.90 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం ఉదయం నుంచి శనివవారం ఉదయం 8.30 గంటల మధ్య భారీ వర్షం కురిసింది. విజయవాడ సెంట్రల్‌లో 34.2 మిల్లీమీటర్లు, వెస్ట్‌లో 34.2, నార్త్‌లో 33.8, ఈస్ట్‌లో 33.6, రూరల్‌లో 33.2, కంచికచర్లలో 28.6, చందర్లపాడులో 24.2, వీరులపాడులో 23.2, మైలవరంలో 21.4, తిరువూరులో 19.8, జి కొండూరులో 19.6, ఇబ్రహీంపట్నంలో 18.4, గంపలగూడెంలో 9.2, ఏ కొండూరులో 9.0, విసన్నపేటలో 7.4, జగ్గయ్యపేటలో 6.8, పెనుగంచిప్రోలులో 6.8, వత్సవాయిలో 5.6, నందిగామలో 4.8, రెడ్డిగూడెంలో 4.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రేపు ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష