
పింఛన్ల పునఃపరిశీలన త్వరగా పూర్తి చేయాలి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగుల) పునఃపరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. పింఛన్ల పునఃపరిశీలన (రీ అసెస్‌మెంట్ ఆఫ్ పింఛన్స్)లో భాగంగా జిల్లా గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, జిల్లా పరిషత్, నగరపాలక సంస్థ, మున్సిపల్ కమిషనర్లతో శనివారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 27,235 మంది విభిన్న ప్రతిభావంతులకు చెందిన లబ్ధిదారులు ప్రతి నెల పింఛన్లు పొందుతున్నారన్నారు. వీరిలో శారీరక వైకల్యం, నేత్ర సమస్యలు, వినికిడి సమస్యలు, మానసిక అనారోగ్యం, మానసిక అస్వస్థత, బహుళ వైకల్యం వంటి విభాగాలకు చెందిన లబ్ధిదారులు ఉన్నారన్నారు. వీరిలో 15,607 మంది లబ్ధిదారుల పునఃపరిశీలన పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన 11,628 లబ్ధిదారుల పునః పరిశీలన కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి పునఃపరిశీలన పూర్తి చేయాలన్నారు. క్యాంపుల సమాచారాన్ని లబ్ధిదారులకు ముందుగా తెలియజేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.