
తొలి న్యాయ సేవా సహాయ కేంద్రం ప్రారంభం
విజయవాడలీగల్: రాష్ట్రంలో తొలి న్యాయ సేవా సహాయ కేంద్రాన్ని విజయవాడలోని రాష్ట్ర సైనిక్ బోర్డు కార్యాలయంలో ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్ పి.భాస్కరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ.. న్యాయ న్యాయసేవా సహాయ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోని, తమకు ఉన్న న్యాయ సంబంధిత సమస్యలకు ఉచితంగా పరిష్కారాన్ని పొందాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయ సేవా సహాయ కేంద్రం ద్వారా దేశానికి సేవ చేసిన సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులుకు అలాగే అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించనున్నారు. సమస్యలకు సత్వర పరిష్కారాన్ని అందించేందుకు న్యాయసేవా సహాయ కేంద్రాలను ఏర్పాటుచేయడం ద్వారా, సమాజానికి వారి సేవలకు గౌరవం తెలపడం లక్ష్యంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ(నల్సా) వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పని చేస్తోంది. నల్సా ఆధ్వర్యంలో నల్సా వీర్ పరివార్ సహాయత యోజన – 2025 పథకాన్ని ప్రవేశపెట్టారు. వీరి ఆదేశాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సూచనలను మేరకు మెంబర్ సెక్రటరీ బి.హిమబిందు ఆధ్వర్యంలో న్యాయ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ డెప్యూటీ సెక్రటరీ హెచ్.అమరరంగేశ్వరరావు, రాష్ట్ర సైనిక్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.