
టీచర్ల జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇటీవల జరిగిన బదిలీల్లో ఉద్యోగోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన పొజిషన్ ఐడీలను కేటాయించి వారికి వెంటనే జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి.శ్రీను, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డిని కలిసి వివిధ సమస్యలను చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను మాట్లాడుతూ జీతాల చెల్లింపులో జాప్యాన్ని నివారించాలని కోరారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల ముఖ ఆధారిత హాజరు నమోదుకు గతంలో ఇచ్చిన హామీలను అనుసరించి ఉదయం 9 గంటల నుంచి 9.10 వరకు గ్రేస్ పీరియడ్‌గా ప్రకటించాలన్నారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు సంబంధించి ఉద్యోగున్నతులు కల్పించాలన్నారు. పదో తరగతి స్పాట్ వేల్యూషన్, పరీక్ష నిర్వహణ, పాఠశాల నిర్వహణ గ్రాంట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలన్నారు. యాప్‌ల భారాన్ని తగ్గించి బోధన సమయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.