
అధికార లాంఛనాలతో లక్కీ అంత్యక్రియలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): పోలీస్ శాఖలో 10 ఏళ్లు సేవలందించి అనారోగ్యంతో మృత్యువాత పడిన జాగిలం లక్కీకి శనివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లాబ్రాడార్ రీట్రీవర్ జాతికి చెందిన లక్కీ 2015లో జన్మించగా, దానికి హైదరాబాద్‌లోని ఐఐటీఏ, ఐఎస్‌డబ్ల్యూ శిక్షణ సెంటర్‌లో డాగ్ హ్యాండ్లర్ ఏఆర్‌హెచ్‌సీ సీహెచ్‌డీ ప్రసాద్ ఆధ్వర్యంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం నగరానికి ముఖ్య వ్యక్తులు విచ్చేసే సమయంలో వారి భద్రత కోసం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ చేపట్టే ముందస్తు చర్యల్లో చురుగ్గా పాల్గొనేదని పోలీస్ సిబ్బంది తెలిపారు. 10 ఏళ్ల పాటు లక్కీ తనదైన నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించి ప్రముఖుల పర్యటనల్లో కీలకంగా వ్యవహరించింది. అనారోగ్యంగా తుదిశ్వాస విడిచిన లక్కీ మృతి పట్ల నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన ఆదేశాల మేరకు డీసీపీలు ఏబీటీఎస్ ఉదయరాణి, కేజీవీ సరిత, సీఎస్‌డబ్ల్యూ డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్, ఏసీపీ కృష్ణంరాజు, ప్రేమ్‌కుమార్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు ఇతర అధికారులు లక్కీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.