
పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): హైకోర్టు న్యాయవాది అనుపమ దార్ల రచించిన ‘మీరు పనిచేసే చోట లైంగిక వేధింపులా.. పోష్ చట్ట ప్రయోజనాలు’ పుస్తకాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆవిష్కరించారు. లైంగిక వేధింపుల నివారణ చట్టం ఆధారంగా చేసుకుని రచించినట్లు రచయిత అనుపమ తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రచించిన పుస్తకంలో చట్టంలోని నిబంధనలు, వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళల హక్కులు తదితర అంశాలను వివరించినట్లు పేర్కొన్నారు. శ్రామిక మహిళలకు సురక్షితమైన పని ప్రదేశాలు పొందడానికి ఈ చట్టం బలమైన కవచం అయినప్పటికీ, అమలు కేవలం కాగితాలకే పరిమితమని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ఈ పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు ట్రస్టు డైరెక్టర్ రావూరి సూయజ్, హ్యాపీ లైఫ్ కౌన్సెలింగ్ సెంటర్ డైరెక్టర్, మనస్తత్వవేత్త డి.కల్యాణి పాల్గొన్నారు.
జిల్లాలో విరివిగా మొక్కలు పెంపకం
కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువు గట్లపై మొక్కలు విరివిగా నాటి పచ్చదనం పెంపొందించేలా చూడాలని కోరారు. మేజర్ గ్రామపంచాయతీల్లో రహదారులను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలా గ్రామ పంచాయతీల్లో తాగునీటి చెరువులు ఉన్నాయని వాటి గట్లపై కూడా మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించే బాధ్యతను పంచాయతీలో ఒకరికి బాధ్యత అప్పగించాలని పేర్కొన్నారు. వారికి మూడు సంవత్సరాల పాటు ఉపాధి హామీ పథకం ద్వారా వేతనం చెల్లిస్తామని వెల్లడించారు. గ్రామాల్లో కనీసం 25 సెంట్లకు పైగా ఉన్న స్థలాన్ని గుర్తించాలని అక్కడ పల్లెవనాల అభివృద్ధికి చొరవ చూపాలని చెప్పారు. జిల్లాలో 196 పాఠశాలల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కావాల్సిన మొక్కల జాబితా సంబంధిత అధికారులు డ్వామా పీడీ కి అందజేస్తే వారు సరఫరా చేస్తారన్నారు. ఆయా జిల్లాలోని అన్ని దేవాలయాల ప్రాంగణాలతో పాటు వాటికి ఆనుకుని ఉన్న స్థలాల్లో కూడా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లోనూ మొక్కలు పెంచేలా చూడాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్ యాదవ్, డీఈవో పీవీజె రామారావు పాల్గొన్నారు.

పోష్ చట్ట ప్రయోజనాలు పుస్తకావిష్కరణ