
వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వడ్డెర/వడియ రాజుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముందు సంఘం రాష్ట్ర కార్యాలయాన్ని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ప్రారంభించారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న వడ్డెర్లకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో అన్యాయం జరుగుతోందన్నారు. వడ్డెర్లను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ వడ్డెర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ ఈనాటిది కాదన్నారు. స్వాతంత్య్ర వచ్చిన నాటి నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని పోరాడుతున్నామన్నారు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్సార్, జనార్ధనరెడ్డి వడ్డెర్లకు ఎన్నో ఫలాలు అందించారని, కూటమి ప్రభుత్వం వాటన్నింటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తాను చట్టసభల్లో అడుగుపెట్టిన తర్వాత వడ్డెర్ల సమస్యలను అనేక పర్యాయాలు ప్రస్తావించానన్నారు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
క్వారీల్లో అవకాశం కల్పించాలి..
సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు వేముల బేబీరాణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులలో వడ్డెర్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్‌గా వడ్డెర కులానికి అవకాశం రాలేదన్నారు. కనీసం బోర్డు మెంబర్లుగా కూడా నియమించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల చైర్మన్లుగా, డైరెక్టర్లు వడ్డెర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండల కేంద్రంలో వడ్డే ఓబన్న విగ్రహం ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు. కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేయాలని, వడ్డెర్లకు క్వారీల్లో అవకాశం కల్పించాలని, సబ్సిడీపై యంత్రపరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓసీసీఐ చీఫ్ అడ్వైజర్ గుంజ నరసింహారావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల లక్ష్మీకాంతయ్య, మంజుల నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు బత్తుల నాగేశ్వరరావు, కన్వీనర్ వేముల శివ, ప్రధాన కార్యదర్శి వేముల మల్లేశ్వరరావు, యువజన సంఘం అధ్యక్షుడు వీరాంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఎర్ల రవిచంద్ర, వేముల శ్రీదేవి, ఒంటిపులి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.