కృష్ణానదిలో యువకుడు గల్లంతు
అమరావతి: కృష్ణానదిలో స్నానానికి దిగి ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన సమాచారం మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన పల్లెగుంట సద్గుణ్(22) తన ఇద్దరు స్నేహితులతో కలసి ద్విచక్రవాహనంపై మంగళవారం అమరావతి మండల పరిధిలోని దిడుగు ప్రాంతానికి చేరుకున్నారు. దిడుగు అవతల ఒడ్డున స్నానానికి కృష్ణానదిలో దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ సద్గుణ్ నీటిలో మునిగి గల్లంతయ్యా డు. ఏటూరు, దిడుగు గ్రామస్తులు నదిలో సద్గుణ్ గల్లంతైన సమాచారాన్ని పోలీసులకు అందించటంతో యువకుని ఆచూకీ కోసం నదిలో గాలిస్తున్నారు.
గుంటూరు రూరల్: భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తూ, తనను జైలుకు పంపి, ఇబ్బందులకు గురిచేస్తోందనే మానసిక వేదనకు గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్ తెలిపిన, మృతుడు వీడియో ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిన సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. మొదటి భార్య మృత్యువాతకు గురవ్వటంతో అడవితక్కెళ్లపాడు టిడ్కో హౌస్‌లలో నివాసం ఉండే వెంకటరమణను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లు కుమార్తె లాయర్ డిగ్రీ పూర్తి చేసుకుని వేముల బాలాజీ అనే వ్యక్తి వద్ద ప్రాక్టీస్‌కు చేరింది. కుమార్తె ప్రాక్టీస్‌కు వెళుతున్న సమయంలో ఆమెకు తోడుగా వెళ్లే వెంకటరమణ, బాలాజీ లాయర్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయమై వెంకటేశ్వర్లు, వెంకటరమణల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండేవి. వివాదాల నేపథ్యంలో వెంకటరమణ, లాయర్ బాలాజీలు ఇరువురు తనపై గతంలో తొమ్మిదికి పైగా అక్రమ కేసులు బనాయించి, తనను జైలుకు కూడా పంపారని వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ముందు చేసిన వీడియో ద్వారా తెలిపాడు. తనపై కేసులు మోపటంతోపాటు తన అన్నదమ్ములు, మొదటి భార్య బిడ్డలపై కూడా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని వాపోయాడు.
● లాయర్ బాలాజీ అండతో తనను తన భార్య చిత్రహింసలకు గురిచేస్తోందని, తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో పేరేచర్లలోని జగనన్న కాలనీలో ఇంటిని కొనుక్కున్నానని, అయితే అందులోకి కూడా తనను వెళ్లకుండా చేసి ఆ ఇంటిని లాయర్, తన భార్య గెస్ట్ హౌస్‌గా వాడుకుంటున్నారని వీడియో ద్వారా వాపోయాడు. గతంలో తనపై పెట్టిన కేసుల్లో జైలు నుంచి వచ్చాక రాజీ కోసం ప్రయత్నించి తన సొంత ఇంటిని అమ్మి డబ్బులు కూడా తన భార్య వెంకటరమణకు ఇవ్వడం జరిగిందని తెలిపాడు. అనంతరం మళ్లీ తనకు ఫోన్ చేసి రూ. 20 లక్షలు ఇస్తే డైవోర్స్ ఇస్తాను, తనపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని ఆ లాయర్, తన భార్య వేధిస్తున్నారని, వారి వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు కారణం లాయర్ బాలాజీ, భార్య వెంకటరమణలే కారణమని పేపర్‌పై రాసి, వీడియోద్వారా తెలిపాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
● వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనకు కారణమైన వెంకటరమణను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. లాయర్ బాలాజీ పరారీలో ఉన్నాడని అతడిని త్వరలో అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కృష్ణానదిలో యువకుడు గల్లంతు


