విజయ డెయిరీని సందర్శించిన నాట్స్ చైర్మన్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) నూతన చైర్మన్ నంద కిశోర్ కంచర్ల మంగళవారం కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ)ని సందర్శించారు. ఆయనకు చైర్మన్ చలసాని ఆంజనేయులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నందకిశోర్‌ను శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణా మిల్క్ యూనియన్ సాధించిన విజయాలు, వినియోగదారులకు అందిస్తున్న పాల ఉత్పత్తుల గురించి చైర్మన్ వివరించారు. యూనియన్ ఉత్పత్తులను నందకిశోర్‌కు పరిచయం చేశారు. పాడి రైతులకు నూతన టెక్నాలజీ, పాడి అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను నాట్స్ తరఫున అందజేసేందుకు తన వంతు కృషి చేస్తానని నంద కిశోర్ హామీ ఇచ్చారు. నంద కిశోర్ వెంట ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ఉన్నారు.


