కారు బీభత్సం కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
● పరారీలో మరో నిందితుడు
●వివరాలు వెల్లడించిన ఏడీసీపీ రామకృష్ణ
భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురంలోని పున్నమీఘాట్ ప్రాంతంలో కొంద రు వ్యక్తులు సృష్టించిన కారు బీభత్సం ఘటనలో భవానీపురం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంగళవారం భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెస్ట్ జోన్ ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్‌కు చెందిన పఠాన్ మున్నా ఖాన్ ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల ప్రాంతంలో కుమారుడు పఠాన్ రిహాన్ ఖాన్ కోరిక మేరకు ఐస్‌క్రీం ఇప్పించేందుకు సమీపంలో ఉన్న పున్నమీఘాట్ వద్దకు తీసుకువెళ్లారు. అదే సమయంలో భవానీపురంలో మద్యం తాగిన నిందితులు కారులో పున్నమీఘాట్ వద్దకు చేరుకుని కారును మితిమీరిన వేగంతో నడుపుతూ అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై ప్రశ్నించిన కొందరిని కారుతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలవ్వగా ఐస్‌క్రీం కోసం వచ్చిన రిహాన్ ఖాన్(9) గవర్నర్‌పేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. బాలుడి తండ్రి మున్నా కూడా గాయపడి అదే హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల అదుపులో నలుగురు..
పున్నమీఘాట్ ఘటనపై ఆ రోజు హత్యాయత్నం కింది కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. అందులో భాగంగా మంగళవారం నలుగురు నిందితులను గొల్లపూడి ప్రాంతంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు ఏడీసీపీ రామకృష్ణ చెప్పారు. నలుగురు నిందితుల్లో పశ్చిమ నియోజకవర్గంలోని పాత రాజరాజేశ్వరి పేటకు చెందిన కొండా యహోవా అలియాస్ పెద్ద చిచ్చా(28), కొండా రమేష్ అలియాస్ చిన్న చిచ్చా(23), భవానీపురానికి చెందిన క్షత్రి వెంకట భార్గవ రామ్ సింగ్ అలియాస్ భార్గవ్(34), వీర్ల మహేష్ (25) ఉన్నారని, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్‌లో నివసించే మరో నిందితుడు జక్కుల దినేష్ పరారీలో ఉన్నాడని వివరించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేష్ అనే వ్యక్తి సర్వీసింగ్ చేయించమని భార్గవ్‌కు ఇచ్చిన కారును నిందితులు ఉపయోగించారని అన్నారు.
నిందితుల్లో ఇద్దరికి నేర చరిత్ర..
నిందితులు పెద్ద చిచ్చా, చిన్న చిచ్చాలకు నేర చరిత్ర ఉందని రామకృష్ణ తెలిపారు. పెద్ద చిచ్చాపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉందని, అతనిపై 18 కేసులు ఉన్నట్లు చెప్పారు. అందులో ఒక మర్డర్ కేసు కూడా ఉందన్నారు. అదే విధంగా రౌడీషీట్ కలిగి ఉన్న చిన్న చిచ్చాపై 42 కేసులు ఉన్నాయని, వాటిల్లో ఎక్కువగా దొంగతనం కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని అన్నారు. అరెస్ట్ అయిన ఇద్దరిపై ఎటువంటి కేసులు లేవన్నారు. సమావేశంలో వెస్ట్ ఏసీపీ ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు, కొత్తపేట సీఐ కొండలరావు పాల్గొన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేసి భవానీపురం పీఎస్‌లో ఉంచగా మంగళవారం తనిఖీ చేశారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు సమాచారం.


