గణతంత్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు
అధికారులతో కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ గ్రౌండ్‌లో వేదికను సుందరంగా అలంకరించాలని, ప్రోటోకాల్‌ను విధిగా పాటించాలన్నారు. విద్యార్థులతో జాతీయ సమైఖ్యత చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లా ప్రగతిని ప్రతిబింబించే విధంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాలు, ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అవార్డును అందుకునే వారి జాబితా సిద్ధం చేయాలని, సందేశం తయారు చేసేందుకు అవసరమైన ప్రగతి నివేదికలు వెంటనే పంపాలన్నారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, ఇన్‌చార్జ్ డీఆర్వో శ్రీదేవి, ఇన్‌చార్జ్ ఆర్డీవో పోతురాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కూచిపూడి(మొవ్వ): మన ఊరు–మన సంక్రాతి సంబరాల్లో భాగంగా మొవ్వ మండలం కూచిపూడిలోని(నన్నపనేని గ్రౌండ్స్)లో నన్నపనేని యువసేన ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి పొట్టేళ్ల పందేలు మంగళవారం రాత్రితో ముగిశాయి. చివరి రోజు రాంపూరి జాతి పొట్టేళ్ల పందేల్లో పాల్గొనేందుకు హైదరాబాద్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పొట్టేళ్లను తీసుకొచ్చారు. కాగా ఈ పోటీలను వీక్షించేందుకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజాతో పాటు ఏఎంసీ చైర్మన్ దోనేపూడి శివరామయ్య, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ లింగమనేని రామలింగేశ్వరరావులతో పాటు పలువురు నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ పొట్టేళ్ల పందేలు, కోడి పందేలు, ఎడ్ల పందేలు మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమయ్యాయన్నారు.
నందిగామ రూరల్: సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సినీ దర్శకుడు వీవీ వినాయక్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సంక్రాంతి పండుగకు తన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు వెళ్తూ మార్గమధ్యలో మండలంలోని అంబారు పేట గ్రామంలో వేంచేసియున్న సత్యమ్మవారిని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ యూత్ కన్వీనర్ పారుపల్లి హరిబాబు స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. గ్రామ నాయకులు ఐలపోగు రాంబాబు, వెలగా సత్యనారాయణ, మందడపు సత్యనారాయణ, గొట్టుముక్కల లక్ష్మణ్, పారుపల్లి భార్గవ్, గంజి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు
గణతంత్ర వేడుకలకు పక్కా ఏర్పాట్లు


