
ఉద్యోగుల బకాయిలపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిపడిన రూ.25 వేల కోట్ల చెల్లింపులపై రానున్న మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు. విజయవాడ విద్యాధరపురంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జీపీఎస్‌పై స్పష్టత ఇవ్వాలి..
వేతన సవరణ విషయంలో హైకోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్‌లో 2025 మార్చి 31 నాటికి ఉన్న బకాయిలను నమోదు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని కోరారు. ఆర్థికపరమైన చెల్లింపులకు చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎస్ చట్టాన్ని కొనసాగిస్తుందా, రద్దు చేస్తుందా అన్న విషయంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులను ఉపసంహరించుకోవాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఐక్యవేదిక తరుఫున జూన్‌లో విజయవాడలో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ఐక్యవేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్, పెన్షన్ సంఘాల అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, వీఆర్వోల అసోసియేషన్ అధ్యక్షుడు భూపతి రాజు, ఐక్యవేదిక వైస్ చైర్మన్ కేదారేశ్వరరావు, రవీంద్రబాబు, డెప్యూటీ సెక్రటరీ జనరల్ నరసింహారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
తక్షణమే ఐఆర్ ప్రకటించాలి
ఐక్యవేదిక చైర్మన్ సూర్యనారాయణ