
కృష్ణానదిలో దూకి యువకుడి ఆత్మహత్య
కోడూరు: అప్పుల బాధ తట్టుకోలేక కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చాణిక్య తెలిపిన వివరాల ప్రకారం.. కోడూరు తూర్పు వైపునకు చెందిన గంధం సతీష్(27) అవివాహితుడు, విజయవాడలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి సతీష్ స్నేహితులతో కలిసి అవనిగడ్డ లంకమ్మ సంబరానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో సతీష్ ఆత్మహత్య చేసుకొనేందుకు ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు వెళ్లాడు. వారధి వద్దకు వెళ్లిన తరువాత ‘ఉల్లిపాలెం బ్రిడ్జి మీద నుంచి దూకి చనిపోతున్నానని.. అమ్మనాన్నను జాగ్రత్తగా చూసుకోండి’ అని స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో కంగుతిన్న స్నేహితుడు సతీష్‌కు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు. దీంతో స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు హుటాహుటినా వారధిపైకి వెళ్లగా సతీష్ ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, చెప్పులు ఉండడాన్ని గమనించారు. సతీష్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారించారు. అయితే అర్ధరాత్రి కావడం, నది మధ్యలో లోతు ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడే సతీష్ అప్పటికప్పడే గల్లంతయ్యాడు. యువకుడు తండ్రి బ్రహ్మారావు ఫిర్యాదు మేరకు ఘటనపై కోడూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆదివారం సతీష్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందితో పాటు స్థానిక మత్స్యకారుల సహాయంతో మూడు బోట్లలో పోలీసులు కృష్ణానదిని జల్లెడపట్టారు. ఆదివారం సాయంత్రం 6గంటల సమయంలో వారధికి సమీపంలోని మడచెట్ల వద్ద సతీష్ మృతదేహం లభ్యమైంది. శవ పంచనమా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఆస్పకి తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. అప్పుల బాధ తాళ్లలేక సతీష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.