
ఇంటర్‌లో ఎన్టీఆర్ సత్తా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు మరో సారి తమ సత్తాచాటారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతాన్ని మించి ఫలితాలు సాధించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో జిల్లా తృతీయ స్థానాల్లో నిలిచింది. గత ఏడాది ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది మాత్రం తృతీయ స్థానానికి పడిపోయింది. మొదటి సంవత్సరం విద్యార్థులు 81 శాతంతో, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 89 శాతం ఫలితాలతో రాష్ట్రంలో తృతీయ స్థానంలో నిలిచారు. 2023 వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఫలితాలు ప్రకటించగా, గత ఏడాది నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇంటర్మీడియెట్ బోర్డు ఫలితాలను ప్రకటిస్తోంది. 39,200 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షకు హాజరవగా 31,676 మంది ఉత్తీర్ణులయ్యారు. 35,484 మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 31,736 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఒకేషనల్‌లో 74.6 శాతం
ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 74.6 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 830 మంది పరీక్షలకు హాజరవగా 620 మంది ఉత్తీర్ణత (74.6 శాతం) సాధించారు. ప్రభుత్వ కాలేజీల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి ఏడాది 241 మంది మంది పరీక్షలు రాయగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం సాధించారు. రెండో సంవ త్సరం 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం సాధించారు. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి 641 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలు రాయగా 443 మంది ఉత్తీర్ణులై 69 శాతం ఫలితాలు సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 66 శాతం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండో సంవత్సరం విద్యార్థులు 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో పది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు న్నాయి. మొదటి ఏడాది పరీక్షకు 997 మంది హాజరవగా 485 మంది ఉత్తీర్ణులై 49 శాతం, రెండో సంవత్సరానికి సంబంధించి 606 మందికి 398 మంది ఉత్తీర్ణులై 66 శాతం ఫలితాలు సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరవగా 206 మంది ఉత్తీర్ణులై 85 శాతం, రెండో సంవత్సరం పరీక్షలకు 189 మంది హాజరవగా 177 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఫలితాలను సాధించారు. ప్రభుత్వ కాలేజీలకు సంబంధించి ఫలితాల్లో రాష్ట్రంలో రెండో సంవత్సరం ఫలితాల్లో 19 స్థానం, మొదటి సంవత్సరం ఫలితాల్లో ఏడో స్థానానికి పరిమితమమైంది. ఏపీఎస్‌డబ్ల్యూఆర్ మొదటి ఏడాది 84 శాతం, రెండో ఏడాది 96 శాతం, ఏపీటీడబ్ల్యూర్ మొదటి ఏడాది 94 శాతం రెండో ఏడాది 99 శాతం, హైస్కూల్ ప్లస్ మొదటి ఏడాది 39 శాతం, రెండో ఏడాది 52 శాతం, మోడల్ స్కూల్ మొదటి ఏడాది 88 శాతం, రెండో ఏడాది 81 శాతం, కేజీబీవీ మొదటి ఏడాది 68 శాతం, రెండో ఏడాది 81 శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన జి.రాజ్య లక్ష్మి ఎంపీసీలో 1000కి 984 మార్కులు, బైపీసీలో మైలవరం జెడ్పీ బాలికల పాఠశాలలో ఉన్న హై స్కూల్ ప్లస్‌లో బూక్యా హరిణి 978, పఠాన్ షాజిదా ఖాతూన్ 976, పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షేక్ రేష్మా 973 మార్కులను సాధించారు.
ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిన జిల్లా ప్రథమ సంవత్సరంలో 81, ద్వితీయ సంవత్సరంలో 89 శాతం ఉత్తీర్ణత మే 12 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రోజూ రెండు పరీక్షలు
ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు మే 12 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు జరుగుతాయి. ఉదయం తొమ్మిది నుంచి 12 గంటల వరకూ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. మే 28 నుంచి జూన్ మొదటి తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ అవకాశం ఉంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు సంబంధించి ఫీజు చెల్లింపునకు ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ అవకాశం కల్పించారు.

ఇంటర్‌లో ఎన్టీఆర్ సత్తా