
మాదిగలకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సీఎం చంద్రబాబునాయుడు వర్గీకరణ ముసుగులో మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నారని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మండిపడ్డారు. విజయవాడలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. వర్గీకరణలో మాదిగలకు 6, మాలలకు 8 రోస్టర్ పాయింట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల చంద్రబాబుపై మాదిగల్లో అసంతృప్తి నెలకొందన్నారు. రోస్టర్ పేరుతో జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరితే కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాదిగలకు మరోసారి అన్యాయం చేస్తున్నారన్నారు.
గద్దె దింపడం కూడా మాదిగలకు తెలుసు
30 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం చేస్తున్న మాదిగలకు చంద్రబాబు చేస్తున్న సామాజిక న్యాయం ఇదేనా అంటూ నిలదీశారు. ఓ వైపు వర్గీకరణ తుది దశకు చేరుకుందని చెబుతూనే ... మరో వైపు విద్య, ఉద్యోగ, సంక్షేమ పథకాలు ఉమ్మడిగా ప్రకటిస్తున్నారన్నారు. ఇలా చేస్తే వర్గీకరణ తర్వాత మాదిగలకు మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. మాదిగల డప్పు కొట్టి, చెప్పు కుట్టి, వర్గీకరణ చేసి పెద్ద మాదిగ అవుతానంటే నమ్మి భుజాన మోసామన్నారు. తీరా వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలోకి వచ్చిన తర్వాత మాదిగలకు ద్రోహం చేయడం అత్యంత బాధాకరమన్నారు. ఓట్లు వేసి గెలిపించిన మాదిగలకు గద్దె దింపడం కూడా తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేసిన రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని, ఆంధ్రాలో మాదిగలకు అన్యాయం చేసిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమన్నారు. లోపాలను సరిచేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 25న నెల్లూరు, 30న కడప, మే 10న రాజమండ్రి, మే 20న విశాఖపట్నం, మే 30న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. నాయకులు చెరుకూరి కిరణ్ మాదిగ, పూనూరు జార్జి మాదిగ పాల్గొన్నారు.