
పూలే సిద్ధాంతాలు ఆదర్శప్రాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలేను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక అసమానతలను రూపుమాపేందుకు పూలే అలుపెరగని పోరాటం చేశారన్నారు. మానవుడికి విద్య జ్ఞానజ్యోతి లాంటిదని పూలే విశ్వసించేవారన్నారు. బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాటం చేయడంతో పాటు సాధికారత దిశగా కృషి చేశారన్నారు. మన దేశంలో గాంధీజీ కంటే ముందే మహాత్మా అని బిరుదు పొందారన్నారు. ఆయన సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి కె. లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఈవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ