
కార్పొరేషన్ల ద్వారా చెక్కుల పంపిణీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ శుక్రవారం వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేశారు. పలువురికి ఆర్థిక సాయం అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల ప్రజల ఆర్థిక స్వాలంబనకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కార్పొరేషన్ల తరఫున లబ్ధిదారులకు సబ్బిడీపై రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్పొరేషన్ల నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 400 మంది లబ్ధిదారులకు రూ.8.05కోట్ల ఆర్థికసాయం అందించినట్లు వివరించారు. లబ్ధిదారులు ఆటోలు, చిరు వ్యాపారాలు, జనరిక్ మెడికల్ షాపులు నిర్వహించుకునేందుకు వెనుకబడిన సంక్షేమశాఖ ద్వారా ఆధ్వర్యంలో రుణాలను మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారిణి. కె.లక్ష్మీదేవమ్మ, సహాయ సంక్షేమ అధికారి పి.శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఏఇవో కె.రాజేంద్రబాబు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు రజనీకుమారి, హేమప్రియ, ఆంజనేయులు పాల్గొన్నారు.