
మొక్కజొన్న ధర ఢమాల్!
కంకిపాడు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మొక్కజొన్న రైతుల పరిస్థితి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా, మార్కెట్‌లో ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆపద సమయంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొనుగోలు కేంద్రాల ఊసే లేకపోవటంతో ధర నిర్ణయం దళారుల ఇష్టారాజ్యంగా తయారైంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్‌లో 11,875 ఎకరాల్లో మొక్క జొన్న సాగు చేశారు. ప్రస్తుతం పది రోజులుగా మొక్కజొన్న కోత సాగుతోంది. కండెలు కోసి గింజలు వేసే యంత్రాలతో మొక్కజొన్న గింజలు వేరు చేయిస్తున్నారు. కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు ఉన్నాయి.
దిగుబడులు సంతృప్తికరం..
ఎకరాకు కౌలు రూ. 12 వేలు, పెట్టుబడులు రూ. 40 వేలు వెచ్చించి రైతులు సాగు చేపట్టారు. ఎకరాకు సరాసరిన 40–45 క్వింటాళ్ల వరకూ దిగుబడులు లభించాయి. పక్షులు, కత్తెర పురుగు ఉద్ధృతితో అక్కడక్కడా నష్టం వాటిల్లినా దిగుబడులు ఘనంగానే వచ్చాయి. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ. 2,225గా నిర్ణయించింది. దీంతో ఆశించిన ధర దక్కుతుందని మొక్కజొన్న రైతులు ఆశించారు.
నీరసపడుతున్న అన్నదాతలు..
దిగుబడులు చేతికందే వరకూ క్వింటా మొక్క జొన్నలు బహిరంగ మార్కెట్‌లో రూ.2,250 నుంచి రూ.2400 వరకూ పలికింది. ప్రస్తుతం పంట చేతికి వస్తోంది. ఈ తరుణంలో ధర నేల చూపులు చూస్తోంది. రోజు రోజుకీ ధరలు దిగజారుతున్నాయి. క్వింటా ధర రూ. 1950 నుంచి రూ. 2వేలు మాత్రమే పలుకుతోంది. ధర పడిపోతుండటంతో మొక్కజొన్న రైతులు నీరసించిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కోత దశలోనూ, ఆరబెట్టిన మొక్కజొన్నలు వర్షానికి తడిచాయి. ఈ పంటను ఆరబెట్టి, ఎండగట్టి మార్కెట్‌కు తరలించేందుకు ఒక్కో రైతు ఎకరాకు రూ. 5 వేలు వరకూ అదనపు పెట్టుబడులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతులు పంటను ఎండబెట్టి గింజ నాణ్యతను కాపాడుకునే పనిలోనే ఉన్నారు. అయితే ప్రకృతి మాత్రం రైతులు వదలటం లేదు. అల్పపీడనం రూపంలో అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఈడుపుగల్లులో ఆరబోసిన మొక్కజొన్న గింజలు
ఆశాజనకంగా దిగుబడులు రోజు రోజుకూ పడిపోతున్న ధరతో ఆందోళన మద్దతు ధర దక్కక తిప్పలు కొనుగోలు కేంద్రాల ఊసేదీ? ప్రకృతి ప్రకోపంతో అదనపు ఖర్చులు
సర్కారు నిర్లక్ష్యం..
నెల రోజుల క్రితమే ప్రతిపాదనలు..
జిల్లా వ్యాప్తంగా సాగు వివరాలను సేకరించాం. మార్కెట్ ఒడిదొడుకులను అంచనా వేశాం. నెల రోజులు క్రితమే ప్రభుత్వానికి నివేదిక కూడా పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన చెందొద్దు.
– మురళీకిషోర్, డీఎం,
మార్క్‌ఫెడ్, కృష్ణాజిల్లా
కూటమి సర్కారు అన్నదాతను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. పంట చేతికందే నాటికి మార్కెట్‌లో ధర తగ్గుముఖం పడితే మద్దతు ధర కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుస్తోంది. పది రోజులుగా మొక్కజొన్న మార్కెట్‌కు చేరుతోంది. మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధర పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో అయినా కొనుగోలు కేంద్రాలను తెరిపించి రైతులకు మద్దతు ధర దక్కేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ప్రదర్శిస్తుండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

మొక్కజొన్న ధర ఢమాల్!