
మహిళలకు అందని ద్రాక్షగా మారిన న్యాయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచార కేసుల్లో బాధిత బాలికలు, మహిళలకు న్యాయం అందని ద్రాక్షగా మారిందని ఏపీ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని అన్నారు. బాధిత మహిళలకు న్యాయం జరగకపోగా వారి హక్కులను, రాజ్యాంగ సూత్రాలను తిరస్కరించేవిగా ఉన్నాయన్నారు. ‘చిన్నారులు మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల తీర్పులను నిరసిస్తూ భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) పిలుపులో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ తాలూకా కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పు కాపీలను దహనం చేశారు. అనంతరం దుర్గాభవాని మాట్లాడుతూ పోక్సో కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మనోహర్ నారాయణ మిశ్రా ఇచ్చిన తీర్పు మహిళా లోకాన్ని ఆవేదనకు గురిచేసిందన్నారు. దేశంలో వివిధ కోర్టుల్లో ఉన్న కేసుల్లో బాధితులకు న్యాయం కంటే దోషులకు ఊరట కలిగించే తీర్పులు వెలువడడం బాధాకరమన్నారు. రాష్ట్రాల హైకోర్టు తీర్పులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణతో పాటు న్యాయ మార్గదర్శకాలను సక్రమంగా పాటించేలా చేయాలని దుర్గాభవాని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ కేసులలో విచారణ జాప్యం జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, నగర నాయకులు డి.సీతారావమ్మ, నీలాపు భాగ్యలక్ష్మి, ఓ.నాగుర్ బి, ప్రభావతి, వేలాంగణి రాణి, ఝాన్సీ, మల్లేశ్వరి, జి.మణి కుమారి, జి.కుమారి, షణ్ముఖ ప్రియ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
ఏపీ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని