
బంగారం, నగదు చోరీపై కేసు నమోదు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బంగారం, నగదు చోరీపై వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే గన్నవరంలో భీమవరపు సామ్రాజ్యం (64) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె తన బంగారపు తాడు తెగిపోవటంతో కొత్త తాడు చేయించుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మూడు కాసుల బంగారపు తాడు, మరో మూడు కాసుల బరువైన రెండు బంగారపు గాజులు, రూ.50 వేల నగదును తీసుకుని తన ఆడబిడ్డ గుజ్జు లక్ష్మీకుమారితో కలిసి బుధవారం మధ్యాహ్నం గన్నవరం నుంచి విజయవాడకు బయలుదేరింది. గన్నవరం నుంచి రామవరప్పాడు వరకు ఒక ఆటో, అక్కడి నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకూ మరో ఆటో ఎక్కి వన్‌టౌన్‌కు చేరుకుంది. ఆటో దిగి సంచిలో చూసుకోగా బంగారం, నగదు కనిపించలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమందించి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాంబే కాలనీలో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం
పాయకాపురం(విజయవాడరూరల్): వాంబే కాలనీ సి బ్లాక్ సమీపంలో డ్రైనేజీ కాల్వలో గుర్తు తెలియని వృద్ధుని శవం పడి ఉండటంతో వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు, సుమారు 70–75 సంవత్సరాల వయస్సు కలిగి బక్కచిక్కి తెల్లనిగడ్డం, జుట్టుతో టీషర్ట్–నిక్కరు ధరించిన వ్యక్తి మృతదేహం ఉంది. స్థానికుల సహకారంతో శవాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవు. సచివాలయ వీఆర్వో టి.జాన్ రాఘవులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు 5–2 అడుగులు ఎత్తు, చామనచాయ రంగు, తెలుపు జుట్టు, తెల్ల టీషర్ట్, లైట్ గ్రీన్ నిక్కరు ధరించి ఉన్నాడని, వయస్సు 70–75 సంవత్సరాలు ఉండవచ్చని తెలిపారు. వివరాలు తెలిసిన వారు నున్న పోలీసు స్టేషన్లో సంప్రదించవచ్చన్నారు.