
యనమలకుదురులో మహిళది హత్యే !
పెనమలూరు: యనమలకుదురు గ్రామ పరిధి కృష్ణానది లంకల్లో మృతి చెందిన మహిళ హత్యకు గురైందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. యనమలకుదురు లంకల్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉందని పోలీసులకు ఈ నెల 5న స్థానికుల ద్వారా సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మృతి చెందిన మహిళ హత్యకు గురైందా లేక ఆత్మహత్య చేసుకుందా అనే విషయం పోలీసులు తొలుత తేల్చలేక పోయారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతి చెందిన మహిళ కోసం ఎవరూ రాకపోవడంతో కేసు పోలీసులకు మిస్టరీగా మారింది.
మహిళది హత్యే..
కేసు విచారణలో భాగంగా పోలీసులు నదికి వెళ్లే మార్గాల్లో ఉన్న సీసీ కెమేరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో పురుషుడు, మహిళ ముఖానికి మాస్క్‌లు ధరించి వెళ్తుండగా వారి వెనుక మృతి చెందిన మహిళ అనుసరించినట్లు గుర్తించారు. ముగ్గురు కరకట్ట మీదుగా వెళ్లి చింతల్ వద్ద కరకట్ట దిగి గ్యాస్ గోడౌన్ మీదుగా నదిలోకి వెళ్లినట్లు గుర్తించారు. ఆ తరువాత 5వ తేదీన మహిళ మృతదేహం కృష్ణానదిలో లభ్యమైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆమెను హత్య చేశారని పోలీసుల నిర్థారించారు.
ఎవరా ఇద్దరు.?
గుర్తు తెలియని మహిళను కృష్ణానదిలోకి తీసుకువెళ్లిన ఇద్దరు ఎవరనేది మిస్టరీగా ఉంది. నదిలో చనిపోయి మహిళ వివరాలు తెలియక కేసు ముందుకు సాగటం లేదు. ఈ నేపథ్యంలో మృతురాలిని నదిలోకి తీసుకు వెళ్లిన ఇద్దరు ఎవరనే ప్రశ్న పోలీసులకు సవాల్‌గా మారింది. అసలా మహిళను ఎందుకు హత్య చేశారో తేలాల్సి ఉంది. మృతి చెందిన మహిళ, ఆమెను నదిలోకి తీసుకు వెళ్లిన ఇద్దరు విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురిని గుర్తించిన వారు కేసు వివరాలను 94906 19468, 86861 35007 ఫోన్ నంబర్లకు కాల్ చేసి తెలపాలని పోలీసులు కోరుతున్నారు.

యనమలకుదురులో మహిళది హత్యే !