
ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన చిన్నారి (5)పై మతిస్థిమితం లేని ఒక వ్యక్తి (42) అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఎన్నికై ంది. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం గాంధీనగర్ లోని ఏపీఎన్‌జీవో హోంలో జిల్లా సహ అధ్యక్షుడు పి.రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ.విద్యాసాగర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడంతో ఆ పదవికి ప్రస్తుతం జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న డి.సత్యనారాయణరెడ్డిని, జిల్లా సహాధ్యక్షుడిగా వి.వి.ప్రసాద్‌ను, కార్యదర్శిగా పి.రమేష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖకు ఎన్నికై న నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని పలువురు ఘనంగా సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రంగారావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, సిటీ అధ్యక్షుడు ఎస్.సూర్యం, కో ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): భవానీపురం సెక్షన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల గృహాలు, వాణిజ్య సముదాయాలపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.5,68,800 జరిమానా విధించారు. విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.విజయకుమారి, విజయవాడ పట్టణ ఇన్‌చార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యు.హనుమయ్య ఆధ్వర్యంలో అధికారులు 42 బృందాలుగా ఏర్పడి 3,148 గృహ సర్వీసులు, 366 వాణిజ్య సముదాయాల సర్వీసులను తనిఖీ చేశారు. వాటిలో 146 సర్వీసులకు అదనపు లోడు 250 కెడబ్ల్యూ మొత్తానికి గాను రూ.5,68,800 మొత్తాన్ని జరిమానా కింద వసూలు చేశారు. ఈ సందర్భంగా విజయకుమారి, హనుమయ్య మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్ చౌర్యం జరిగినట్లు తెలిస్తే 9440812362, 944081 2363, 8331014951 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీలలో విజయవాడ పట్టణ డీ1 డీఈఈ ఎంవీవీ రామకృష్ణ, ఏఏఓ పి.ప్రసాద్, ఏఈ కేవీఎస్ రామప్రసాద్‌లతోపాటు విజయవాడ పట్టణ డివిజన్ పరిధిలోని డీఈఈలు, ఏఈలు, జేఈలు, ఫోర్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): డీఎస్సీ ద్వారా చేపట్టే వ్యాయామ ఉపాధ్యాయుల నియామకంలో ఈవెంట్స్‌కు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని ఏపీ వ్యాయామ విద్య పోరాట సమితి, అఖిల భారత యువజన సమాఖ్య కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. విజయవాడ అలంకార్ సెంటరు ధర్నా చౌక్‌లో సోమవారం అభ్యర్థులు వినూత్న నిరసన చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈవెంట్స్‌కు వెయిటేజ్ మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యదర్శి కె.శివారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు లంకా గోవిందరాజులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, మధు, చెల్లయ్య, వెంకట్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి