
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):ప్రభుత్వాలు పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ’ పుస్తకాన్ని నారాయణమూర్తి ఆవిష్కరించారు. సోమవారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాసరావు అధ్యక్షతన ఆవిష్కరణ సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తూ రాష్ట్రాల అధికారాలను గుంజుకుంటోందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని రాష్ట్రాలను బలహీనం చేయడం సరికాదన్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు, హామీలను విస్మరిస్తోందన్నారు. ఆచరణలో సాధ్యం కాని పథకాలను రూపొందించడం మంచిది కాదన్నారు. అవసరం లేని పథకాలకు నిధులు వెచ్చించడం సరైన విధానం కాదని, ఆచరణ సాధ్యం కాని పథకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. రాయలసీమ ప్రాజెక్టుల సాధన సమితి నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి, రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, సింహాద్రి ఝాన్సీ, డి.హరనాథ్, పి.జమలయ్య తదితరులు పాల్గొన్నారు.