నగదు వ్యవహారంలో వివాదం.. కుమార్తె ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): తల్లి, కూతురు మధ్య చోటుచేసుకున్న నగదు వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి ఓ వివాహిత ప్రాణాలను తీసుకునేలా చేసింది. న్యాయం చేయాల్సిన పోలీసులు వివాహిత పట్ల దురుసుగా ప్రవర్తించడం, తల్లి వ్యవహారశైలి నచ్చక పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వివాహితకు పదే పదే ఫోన్ చేయడంతో పాటు కేసు రాజీ చేస్తానంటూ ఆమె నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
తల్లి, కుమార్తె మధ్య గొడవలు
పోలీసులు తెలిపిన వివరాలు, సేకరించిన వివరాల మేరకు విశాఖపట్నం సుందరయ్యనగర్‌కు చెందిన కామిశెట్టి మౌనిక(35), కృష్ణశంకర్‌లు భార్యభర్తలు. మౌనిక తల్లి గుత్తికొండ రమాదేవి విజయవాడ చిట్టినగర్‌లో నివాసం ఉంటోంది. రమాదేవికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం కిందట రమాదేవి భర్త మరణించడంతో ఇన్సూరెన్స్ ద్వారా రూ.8 లక్షలు వరకు వచ్చాయి. రమాదేవి కొద్ది నెలలుగా వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. చిన్న కుమార్తె అయిన మౌనిక ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఇటీవలే తల్లి వద్దకు వచ్చేసింది. తల్లి వద్ద ఉన్న డబ్బుల్లో రూ.2 లక్షలు ఇవ్వాలని అడుగుతోంది. ఇదే విషయమై తల్లి కూతురు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెల 30న మౌనిక తల్లితో డబ్బుల విషయమై అడిగింది. నాన్న చనిపోయిన తర్వాత మరోకరితో ఉండటం తనకు ఇష్టం లేదని, వైజాగ్ వచ్చేయాలని కోరింది. ఈ క్రమంలో మౌనిక వెంకటేశ్వరరావును కులం పేరుతో దూషించడంతో గొడవ తారాస్థాయికి చేరి పంచాయతీ పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లింది. తన కుమార్తె డబ్బుల కోసం గొడవ చేస్తోందని రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణ పేరుతో వేధింపులు
ఫిర్యాదును తీసుకున్న పోలీసులపై వెంకటేశ్వరరావు ఒత్తిడి చేయడంతో మౌనికను స్టేషన్‌కు పిలిచి విచారణ చేశారు. తాను వైజాగ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని, ఇక ఆ డబ్బులు వద్దు.. మా అమ్మ వద్దని పోలీసులకు చెప్పినా వినిపించుకోలేదు. స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరు కావాలని పదే పదే ఫోన్లు చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో విచారణ లేకుండా కేసు రాజీ చేస్తానని స్టేషన్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ మౌనిక నుంచి డబ్బులు వసూలు చేసినట్లు మృతురాలి బంధువులు పేర్కొంటున్నారు. విచారణ పేరుతో స్టేషన్‌లో పోలీసులు, తల్లి, వెంకటేశ్వరరావు అన్న మాటలను నేను భరించలేకపోతున్నానని భర్తకు ఫోన్ చేసి కన్నీటి పర్యంతమైంది. ఇదే విషయాన్ని అక్క, బావలైన వెనిగళ్ల విజయలక్ష్మి, గోపినాథ్‌లకు చెప్పి బాధపడింది. స్టేషన్‌లో జరిగిన వ్యవహారంతో తాను మానసికంగా కుంగిపోయానని, తల్లి నడుచుకుంటున్న తీరు, పోలీసుల అన్న మాటలు నన్ను బాధపెట్టాయంటూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మౌనిక పురుగుల మందు తాగి తల్లి ఇంటి ముందుకు వెళ్లి పడిపోయింది. ఈ క్రమంలో గోపీనాథ్ దంపతులువచ్చి చూడగా అప్పటికే మౌనిక చలనం లేకుండా పడి ఉంది. వెంటనే 108 వాహనంలో హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మౌనిక భర్త కృష్ణశంకర్ హుటాహుటిన వైజాగ్ నుంచి గురువారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
తల్లి, పోలీసుల వేధింపులే
కారణమంటున్న బంధువులు


