
సీసాల్లో పెట్రోల్, డీజిల్ విక్రయించొద్దు
చిలకలపూడి(మచిలీపట్నం): ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు పెట్రోల్ బంకు యాజ మాన్యాలు లూజుగా పెట్రోల్, డీజిల్ విక్రయించొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి జూన్ 6వ తేదీ వరకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సీసాల్లోగానీ, క్యాన్లలోగానీ ఇతరత్రా విక్రయించరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటిని జిల్లా పౌర సరఫరాల అధికారితో పాటు గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు అమలయ్యేలా పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ఎయిడ్స్‌రహిత సమాజానికి కృషి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎయిడ్స్ రహిత సమాజానికి కృషి చేద్దామని డీఆర్వో వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ వద్ద ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కొవ్వొత్తులు వెలిగించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజా భాగస్వామ్యంతో ఎయిడ్స్ వ్యాధిని రూపుమాప వచ్చన్నారు. ఎయిడ్స్‌తో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా మే నెల 3వ ఆదివారం కొవ్వొత్తులను వెలిగించి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి ఉషారాణి మాట్లాడుతూ ఎయిడ్స్ కారణంగా జిల్లాలో గతేడాది 661 మంది మృతి చెందారన్నారు. జిల్లాలో ఏడు హెచ్‌ఐవీ నిర్ధారణ కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, 75 ప్రభుత్వాస్పత్రులు, 10 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీపీఎం పి. కిరణ్, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కో–ఆర్డినేటర్ రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.