ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి

Published Mon, May 20 2024 8:15 AM

ఓట్ల

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఓట్ల లెక్కింపునకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఢిల్లీరావు ఆదేశించారు. జూన్‌ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం ఢిల్లీరావు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఇదే తరహాల్లో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇబ్రహీంపట్నం నోవా, నిమ్రా ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూములలో ఈవీఎంలు భద్రపరిచారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో నిరంతర నిఘాతో పటిష్టమైన మూడు అంచెల భద్రత ఉందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, సీల్‌ వేసిన డోర్‌లు, సెక్యూరిటీ, కారిడార్లను నిరంతరం సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు పర్యవేక్షించాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను స్ట్రాంగ్‌ రూముల పరిసరాల్లోకి అనుమతించరాదన్నారు. స్ట్రాంగ్‌ రూముల నుంచి లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు ఉండాలన్నారు. బారికేడ్లు, మెష్‌లు, చైర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఇతర లెక్కింపు సిబ్బంది వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో అసెంబ్లీకి 14 టేబుల్స్‌, పార్లమెంటుకు 14 టేబుల్స్‌ చొప్పున 28 టేబుల్స్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు ప్రత్యేక టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌ కుమార్‌, వీఎంసీ కమిషనర్‌ స్వప్నల్‌ దినకర్‌ పుండ్కర్‌, డీఆర్వో వి. శ్రీనివాసరావు, రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు.

పెనుగంచిప్రోలులో

భక్తజన సందడి

పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. వచ్చే నెలలో పాఠశాలల ప్రారంభం, రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించనుండటంతో భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు.

ముగిసిన త్యాగరాజ జయంతి ఉత్సవాలు

విజయవాడ కల్చరల్‌: శ్రీ సద్గురు సంగీత సభ ఆధ్వర్యాన దుర్గాపురంలోని శివరామకృష్ణక్షేత్రంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి 257వ జయంతి ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. త్యాగరాజ స్వామి రచించిన ఘనరాగ పంచరత్నకీర్తనలను 150 మంది సంగీత విద్వాంసులు ఏకకాలంలో ఆలపించారు. పోపూరి గౌరీనాఽథ్‌, గాయత్రి గౌరీనాథ్‌, మోదుమూడి సుధాకర్‌, అంజనా సుధాకర్‌, మల్లాది రాంకుమార్‌, మల్లాది రవికుమార్‌, సీవీవీ శాస్త్రి, చిట్టాదీపక్‌, చారుమతీ పల్లవితోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు కీర్తనలను గానం చేశారు. సంగీత విద్వాంసుడు ఎన్‌సీహెచ్‌ బుచ్చయ్యాచార్యులు త్యాగయ్య రామ భక్తి సామ్రాజ్యం కీర్తనల అంశంగా ప్రసంగించారు. సంగీత విద్వాంసులు కీర్తనల ద్వారా కొలుస్తూ ఉంటే కూచిపూడి నాట్యాచార్యుడు డాక్టర్‌ చింతారవి బాలకృష్ణ బృందం నృత్యాలను మనోహరంగా ప్రదర్శించారు. నిర్వాహకులు నృత్య కళాకారులను, నాట్యాచార్యులను ఆత్మీయంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బీవీఎస్‌ ప్రకాష్‌, ఉపాధ్యక్షుడు హరిప్రసాద్‌, సహాయ కార్యదర్శి జేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ శర్మ పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు  ఏర్పాట్లు చేయండి
1/1

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయండి

Advertisement
 
Advertisement
 
Advertisement