
అధికారులతో చర్చిస్తున్న ఈవో రామారావు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వీఐపీలైనా, సాధారణ భక్తులైనా ప్రతి ఒక్కరూ దర్శన టికెట్లు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని దుర్గగుడి ఈవో కేఎస్ రామారావు ఆలయ అధికారులను ఆదేశించారు. దుర్గగుడిలోని ఏఈవోలు, సూపరింటెండెంట్లు, అన్నదానం, పూజలు, కనకదుర్గ ప్రభ, ఇంజినీరింగ్, అర్చకులతో బుధవారం సమావేశమయ్యారు. అమ్మవారి దర్శనానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారని, అయితే భక్తుల రద్దీకి.. దేవస్థానం విక్రయిస్తున్న టికెట్లకు పొంతన లేకుండా ఉందన్నారు. సాధారణ భక్తులైనా, సిఫార్సులతో వచ్చే ప్రముఖులైనా, వీఐపీలైనా టికెట్లను కొనుగోలు చేయాల్సిందేనన్నారు.
ఈ చర్యలు తీసుకోండి..
● ప్రతి నిత్యం నాలుగు వేల నుంచి 5 వేల మందికి అన్నదానం జరుగుతోందని అధికారులు పేర్కొనగా, భవిష్యత్తులో ఆ సంఖ్యను రెట్టింపు జరిగేలా చూద్దామని ఈవో చెప్పారు.
● కార్తిక మాసం నేపథ్యంలో భక్తులు, అయ్యప్పలు, భవానీలు నదిలో దిగి పుణ్యస్నానాలు ఆచరించేలా స్నానఘాట్లను సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ విభాగానికి సూచించారు.
● సీఎస్‌లో ఘాట్‌రోడ్డు మరమ్మతులు, ఇతర పనులపై సమావేశంలో చర్చించామని, ఇంజినీరింగ్ పనులపై త్వరలోనే పూర్తి స్థాయి సమావేశం నిర్వహించి చర్చిద్దామన్నారు.
● దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కనకదుర్గ ప్రభకు మరింత ప్రాచుర్యం లభించేలా చూడాలని, అదే విధంగా ప్రతి నిత్యం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక ప్రదర్శనలు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో ఏఈవోలు ఎన్. రమేష్‌బాబు, చంద్రశేఖర్, సుధారాణి, వెంకటరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్. రమాదేవి, సూపరింటెండెంట్లు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఇతర అధికారులు పాల్గొన్నారు.
దుర్గగుడి ఈవో రామారావు