
ప్రమాదానికి కారణమైన కారు
లోకేష్ యాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి కారులో వచ్చిన నలుగురు యువకులు మద్యంమత్తులో హల్‌చల్ చేశారు.
మంగళగిరి: లోకేష్ యాత్రలో పాల్గొనేందుకు విజయవాడ నుంచి కారులో వచ్చిన నలుగురు యువకులు మద్యంమత్తులో హల్‌చల్ చేశారు. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ దుర్ఘటన బుధవారం జరిగింది. తాడేపల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి కలకాల తేజశ్రీ విష్ణు వర్థన్ చౌదరి మరో ముగ్గురితో కలిసి లోకేష్ బస చేస్తున్న నగరంలోని యర్రబాలెంకు చేరుకున్నారు.
మద్యం ఫూటుగా తాగి కారులో టీడీపీ జెండాలతో తిరుగుతూ చక్కర్లు కొట్టారు. తాడేపల్లి నులకపేట వద్ద విజయవాడకు చెందిన ఏసీ మెకానిక్‌లు బి.గోపి, పి.రాఘవేంద్ర ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చౌదరి తమ కారుతో వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఫలితంగా గోపి, రాఘవేంద్ర గాయపడ్డారు. స్థానికులు ఘటనాస్థలికి చేరుకునేలోపు చౌదరి అతని స్నేహితులు కారు వదిలి పరారయ్యారు.
స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.