ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదార‌త‌.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!

ITServe Alliance Northeast Chapter Donates1000 Dollars To TASK - Sakshi

అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్‌ అలియన్స్‌) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్‌ఆర్‌ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్‌) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్‌ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్‌ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్‌ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు.

ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్‌ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు.

(చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం)

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top