
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ఆటా.. ఐఐటీ హైదరాబాద్‌తో చారిత్రక ఒప్పందం చేసుకుంది. ఇంజనీరింగ్‌లో దేశంలోనే 7వ ర్యాంక్, ఆవిష్కరణలలో 6వ ర్యాంక్ సాధించిన ఐఐటీ హైదరాబాద్ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యార్థుల గ్లోబల్ ఇంటర్న్‌షిప్ అవకాశాల కల్పన కోసం అవగాహన ఒప్పందం జరిగింది.
వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా,ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి, ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా కొన్ని వారాల నుండి ఒక సంవత్సరం వరకు ఐఐటీలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభించనున్నాయి. ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.
తెలుగు డయాస్పోరాకు చెందిన విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు ఆధునిక పరిశోధన, ఇన్నోవేషన్‌లలో అనుభవం పొందే మార్గాలు ఏర్పడతాయని జయంత్ చల్లా పేర్కొన్నారు. టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల్లో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అర్థం చేసుకోవడంలో యువతకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తొలిసారిగా భారతదేశం వెలుపల ఐఐటీ ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రొఫెసర్ బి.ఎస్.మూర్తి. IITH అర్హులైన విద్యార్థులకు వసతి ఇతర సదుపాయాలు నామమాత్రపు ఫీజుతో కల్పిస్తుందన్నారు.